ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.50 వేల కోట్లతో ?

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.50 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా భారీ పెట్టుబడి, వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. రిఫైనరీ ఏర్పాటుకు రెండుచోట్ల స్థలాలను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపారు. వాటీలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదించారు. ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ముంబై, కొచ్చి,.. మధ్యప్రదేశ్‌లో రిఫైనరీలను సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తోంది. రాష్ట్రానికి ఉన్న తీరప్రాంతం రిఫైనరీ ఏర్పాటుకు అనువైనదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు.
రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లో రిఫైనరీ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం రూ.500 కోట్ల రుణం ఇవ్వడంతో పాటు 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందని సంస్థ యాజమాన్యం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే తరహాలో ప్రోత్సహకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఎల్ సంసిద్ధత తెలిపిందని ఒక అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈలోగా మరోసారి సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీపీసీఎల్ ప్రాజెక్టును కేటాయించేలా సహకరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఒక అధికారి తెలిపారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.