BJP: మిత్రపక్షానికి షాక్ ఇచ్చిన బీజేపీ..! మోదీ నుంచి ఏం నేర్చుకోవాలి?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) నేతృత్వంలోని నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వం, తన మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీల కోర్కెలను చట్టబద్ధంగా, ఆచితూచి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడంలో తనదైన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రధాన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం టీడీపీ అభ్యర్థనలను అడ్డగోలుగా ఆమోదించకుండా చట్టప్రకారం వ్యవహరిస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacherla) అనుమతుల విషయంలో ఈ స్పష్టమైంది.
చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం, గోదావరి జలాలను బనకచర్ల ద్వారా తరలించే ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి అనుమతులు కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో సాగునీటి సమస్యలను పరిష్కరించాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ తెలంగాణ నదీ జలాల హక్కులకు భంగం కలిగిస్తుందని భారత రాష్ట్ర సమితి (BRS) ఆరోపించింది. బీఆర్ఎస్ నేతలు ఈ ప్రాజెక్ట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి, నిరసనలు చేపట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపింది. దీని వల్ల తమ రాష్ట్ర నీటిప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర నిపుణుల కమిటీ బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను వెనక్కి పంపింది. చట్టప్రకారం మరింత పరిశీలన అవసరమని సూచించింది.
సాధారణంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మిత్రపక్షాల కోర్కెలను చట్టానికి అతీతంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. టీడీపీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి కీలక మద్దతుదారుగా ఉన్నప్పటికీ, బీజేపీ ఆ పార్టీ అభ్యర్థనలను అడిగిన వెంటనే ఆమోదించకుండా, చట్టపరమైన ప్రక్రియలను ఖచ్చితంగా అనుసరిస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ అనుమతులను తిరస్కరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినా తెలంగాణ ప్రయోజనాలన, ఆ రాష్ట్ర అభ్యంతరాలను పరగిణనలోకి తీసుకుని తిరస్కరించింది.
రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, దేశవ్యాప్తంగా న్యాయమైన పాలనను అందించాలనే వైఖరిని బీజేపీ ఇక్కడ అనుసరించిందనే చెప్పాలి. టీడీపీ మద్దతు లేకపోతే కూటమి బలహీనం కావచ్చనే భయం ఉన్నప్పటికీ, బీజేపీ ఈ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. ఇది బీజేపీ స్వతంత్ర నిర్ణయాధికారాన్ని, చట్టపరమైన బాధ్యతను చాటిచెబుతోంది. బీజేపీ తన మిత్రపక్షాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే, రాజకీయ సమతుల్యతను కాపాడుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలోని విపక్షం ఈ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించడంతో, బీజేపీ తెలంగాణలో తన రాజకీయ ఆధిపత్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడింది. ఈ నిర్ణయం ద్వారా, బీజేపీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఆ రాష్ట్రంలో తన పట్టును బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసింది.
మరోవైపు, టీడీపీకి ఈ నిర్ణయం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, బీజేపీ చర్య వారి మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీయలేదు. టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతోంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలూ దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడతాయి. అయినప్పటికీ, బీజేపీ యొక్క ఈ చట్టబద్ధ విధానం టీడీపీకి ఒక సందేశాన్ని పంపింది—మిత్రపక్షాలైనా సరే, చట్టం ముందు అందరూ సమానమేనని.! బీజేపీ విధానం ఇతర రాజకీయ పార్టీలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు, తమ మిత్రపక్షాల కోర్కెలను నెరవేర్చడానికి చట్టాన్ని పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇది అవినీతికి, అక్రమాలకు దారితీస్తుంది. రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశాలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో బీజేపీ గట్టిగానే ఉందని అర్థమవుతోంది. రాజకీయ లాభాల కంటే చట్టం, నీతి, న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీజేపీ దేశ రాజకీయాల్లో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.