AP BJP: 5శాతం పదవులా కుదరదంతే.. కూటమిపై తీరుపై బీజేపీ గుస్సా..?

ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అనుకున్నట్లుగానే కేంద్రం సహకారంతో ఏపీ నెమ్మదిగా గాడిన పడుతోంది. సంక్షేమ పథకాల విషయంలోనూ కేంద్రం నుంచి చక్కని సహకారమందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రధాని మోడీ (Modi), ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నారు కూడా. దీంతో కూటమి చక్కగా పెర్ఫార్మ్ చేస్తోందన్న అంచనాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీనికి తోడు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపాలనపై.. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు కూడా.
అయితే అంతా బాగుందా అంటే లేదని చెబుతున్నాయి బీజేపీ (BJP) శ్రేణులు. ఎందుకంటే.. కూటమిలో పదవుల పందేరం విషయంలో తమకు పూర్తిగా న్యాయం జరగడం లేదన్నది ఆపార్టీ నేతలు, క్యాడర్ భావనగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల సీట్ల నుంచి కార్పొరేషన్ పదవుల వరకూ తమకు అన్నింటా అన్యాయం జరుగుతోందన్న భావన ఆ నేతలే స్వయంగా వ్యక్తం చేస్తున్నారు .
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేదికపై నుంచి పలువురు నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా విషయం అడిగితే తమకు 80శాతం, మరో పార్టీకి 15శాతం, మీకు మాత్రం 5 శాతం మాత్రమే అంటున్నారని.. ఇది తమకు అంగీకారం కాదన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. అంతేకాదు.. తమ ప్రాధాన్యం ఏమిటో ప్రభుత్వానికి తెలియాల్సి ఉందన్నారు. ఏదైనా అడిగితే ఆ 5శాతం అంటున్నారని.. అది చాలా దారుణమన్నారు విష్ణుకుమార్ రాజు.
ఇక సాక్షాత్తూ కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా.. ఈఅంశంపై స్పందించారు. తాము ఎప్పటికి ఒకపార్టీపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదన్నారు. గతంలో బీజేపీకి ఏపీలో 18శాతం ఓటు బ్యాంకు ఉండేదన్నారు. ఈసారి ఓపార్టీ తమకు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. మనమే మిగిలిన పార్టీలకు సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఉండాలన్నారు. అయితే టీడీపీ, జనసేన నాయకులకు జరుగుతున్న న్యాయం.. బీజేపీ నేతలకు జరిగేలా చూడాలన్నారు ఎంపీ సీఎం రమేష్. మరి కొత్త అధ్యక్షుడు మాధవ్.. ఇప్పుడీ అంశాన్ని ఎలా పరిష్కరించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.