Bhumans Vs Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన సంచలన ఆరోపణలు ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఓ సంచలనం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), సీనియర్ ఐఏఎస్ వై.శ్రీలక్ష్మిపై (IAS Srilakshmi) తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలక్ష్మి, గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆమెపై భూమన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోనే వివాదం రేపాయి. టీడీఆర్ బాండ్స్ (TDR Bonds) కుంభకోణానికి ఆమే ప్రధాన సూత్రధారి అని భూమన ఆరోపించారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. వైసీపీతో సన్నిహిత సంబంధాలు కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీలక్ష్మిపై అదే పార్టీకి చెందిన కీలక నేత ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది.
శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ సెక్రటరీగా పనిచేసింది. ఓబులాపురం (OMC) అక్రమ మైనింగ్ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. 2011లో ఆమె అరెస్టు అయ్యారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత, తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. వై.ఎస్. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చి MAUD శాఖలో కీలక పదవికి నియమించారు. జగన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన అధికారిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీలక్ష్మికి విధులు కేటాయించకుండా పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలక్ష్మిని అవినీతిలో అనకొండగా, తాటకి, పూతన, లంకిణిలా అభివర్ణించారు. ఆమె రోజుకు రూ.1.5 లక్షల విలువైన చీరలు కట్టుకుంటుందని, 50 లక్షల రూపాయల విలువైన 11 విగ్గులు ధరిస్తుందని ఆరోపించారు. ఆమె జీతం ఎంత? ఆమె ధరించే చీరలు, విగ్గులు ఎలా కొంటున్నారు? అని ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో శ్రీలక్ష్మి మాస్టర్ మైండ్‌గా ఉందని, టీడీపీ నేతలతో కలిసి వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తిరుపతిలో రోడ్ల వెడల్పు సమయంలో వందల కోట్లు దోచుకోవాలని ఆమె ప్రయత్నించిందని, తాము అడ్డుకున్నామని చెప్పారు.
టీడీఆర్ బాండ్స్ అంటే ప్రైవేటు భూములు స్వాధీనం చేసుకునే సమయంలో మన్సిపల్ కార్పొరేషన్లు భూస్వాములకు ఇచ్చే కాంపెన్సేషన్ ఫారాలు. ఇవి డెవలప్మెంట్ రైట్స్‌గా బదిలీ చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి, తణుకు, విశాఖపట్నం, కాకినాడ మున్సిపాలిటీల్లో ఈ బాండ్స్ జారీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ.10 వేల కోట్లకు పైగా బాండ్స్ జారీ చేశారని, దీనిలో రూ.2 వేల కోట్లు కమీషన్‌గా తీసుకున్నారని సమాచారం. తిరుపతిలో 373 బాండ్స్ జారీ చేసి, రూ.4 వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలో రూ.2,500 కోట్లను వైసీపీ నేతలు అక్రమంగా బదిలీ చేసుకున్నారని అంచనా. భూములను కమర్షియల్‌గా చూపించి, GPA హోల్డర్లకు ఫేక్ బాండ్స్ ఇచ్చారని, రైతు భూములు, స్లమ్ ఏరియాల్లో 1:1 రేషియోకు బదులు 1:4 రేషియోలో బాండ్స్ జారీ చేశారని ఆరోపణలున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, సెప్టెంబర్ నాటికి పూర్తి రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. CID, ACB, విజిలెన్స్ విభాగాలు విచారణలు చేపట్టాయి. తణుకులో మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. తిరుపతిలో రూ.170 కోట్లు, విశాఖలో 393 బాండ్స్‌లో అక్రమాలు గుర్తించారు. భూమన కరుణాకర్ రెడ్డి, కుమారుడు అభినయ్ రెడ్డి ఈ స్కాంలో ప్రధాన ఆరోపితులుగా ఉన్నారు.
టీడీఆర్ కుంభకోణం విచారణకు శ్రీలక్ష్మి సహకరిస్తున్నారనేది భూమన అనుమానం. టీడీపీ నేతలకు ఆమె సమాచారం లీక్ చేస్తోందని ఆయన భావిస్తున్నారు. ఆమె నోరు విప్పితే తాను కూడా ఇరుక్కుపోతాననేది భూమన భయం. అందుకే రివర్స్ ఎటాక్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో భూమనకు మద్దతు కరువైంది. ఆ పార్టీ అనుకూల పత్రిక కూడా భూమన వ్యాఖ్యలను పట్టించుకోలేదు. దీన్నిబట్టి భూమన భయాందోళనకు గురవుతున్నారని సమాచారం.
మరి భూమన అనుమానిస్తున్నట్టు శ్రీలక్ష్మి టీడీపీ నేతలకు సహకరిస్తున్నారా అనేది తెలీదు. కానీ భూమన మాత్రం టీడీఆర్ బాండ్ల కుంభకోణం కేసులో ఇరుక్కుపోవడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకే ఆయన శ్రీలక్ష్మిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారని సమాచారం.







