Margani Bharat: వచ్చే ఎన్నికల్లో భరత్ మళ్లీ లోక్‌సభ రంగంలోకి.. వైసీపీ మాస్టర్ ప్లాన్..
రాజమండ్రి (Rajahmundry) రాజకీయాల్లో యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మార్గాని భరత్ (Margani Bharat) గత ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తరఫున కీలక పాత్ర పోషించారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) స్వయంగా ఎంపిక చేసి రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పోటీ చేయించడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. బీసీ వర్గానికి చెందిన నాయకుడైన భరత్‌ను ముందుకు తేవడం పార్టీకి బలమైన సామాజిక లాభాలు తెచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం నడిచిన సమయంలో భరత్ విజయం సాధించడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో కూడా పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి.
అయితే 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీ అంతర్గత మార్పులు, సీట్ల మార్చడం, స్థానిక అసంతృప్తులు ఇలా అనేక అంశాలు కలిసి వైసీపీకి అనుకూలంగా పనిచేయలేదు. అయిదేళ్ల పాలనపై పెరిగిన యాంటీ-ఇంకంబెన్సీ కూడా పార్టీకి పెద్ద దెబ్బతీసింది. ఫలితంగా, వైసీపీ అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం జగన్ మరింత జాగ్రత్తగా వ్యూహాలు రూపొందిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాజీ పడకుండా, నిజంగా పనిచేసే నాయకులకు మాత్రమే అవకాశమివ్వాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో వారి సామాజిక బలం, పార్టీ మీద ఉన్న నమ్మకం, ప్రజల్లో వారి గుర్తింపు, అలాగే గెలుపు అవకాశాలు ప్రధాన ప్రమాణాలుగా ఉంటాయని అంటున్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ముందుకు తేవాలని జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం. ముఖ్యంగా పాతిక లోక్‌సభ సీట్లపై (Loksabha Seats) ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రతి సీటుకు గెలుపు సామర్థ్యం ఉన్న నాయకులను ముందుగానే గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమందికి ఇప్పటికే వారి భవిష్యత్ బాధ్యతలపై స్పష్టమైన సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే నేపథ్యంలో భరత్ విషయంలో కూడా జగన్ స్పష్టమైన అభిప్రాయం కలిగినట్టు సమాచారం. గతసారి ఆయనను అసెంబ్లీ ఎన్నికలకు రాజమండ్రి అర్బన్ (Rajahmundry Urban) నుంచి నిలబెట్టినప్పటికీ, ఫలితాలు అనుకున్నట్లు రాలేదు. ఈసారి మాత్రం భరత్‌కు లోక్‌సభే సరైన ఎంపిక అవుతుందని జగన్ భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. భరత్ అనుచరులు ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకున్నప్పటికీ, పార్టీ ఆలోచన మాత్రం ఆయనను మళ్లీ పార్లమెంట్ రేసులోనే దింపాలని ఉన్నట్లు తెలుస్తోంది.
గోదావరి జిల్లాల్లో (Godavari Districts) కూడా ఇలాంటి మార్పులు చేయాలని వైసీపీ పెద్దల ఆలోచన. బలమైన ఎంపీ అభ్యర్థులు ఉంటే అసెంబ్లీ సీట్లపై కూడా ఆ ప్రభావం పడుతుందని పార్టీ నమ్ముతోంది. చివరకు జగన్ కొత్త వ్యూహం ఎలా ఫలిస్తుందో చూడాల్సి ఉంది.






