Banakacharla Project: బనకచర్లకు కేంద్రం బ్రేక్.. పర్యావరణ అనుమతులు పై అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి కీలకంగా భావించిన బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)కు కేంద్రం అనూహ్యంగా బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరిగి పంపుతూ, అనుమతుల లేని పనులు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
ప్రాజెక్టు పనుల భాగంగా బనకచర్ల కాలువ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వ యోచన ఉండగా, ఇప్పుడు ఆ ప్రణాళిక నిలిచిపోయింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంలో తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫిర్యాదు ప్రధాన కారణం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ పాలకులు చేపడుతున్న పనులు అక్రమమని పేర్కొంటూ ఆయన ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా తనదైన శైలిలో రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. సముద్రంలో కలిసిపోయే నీళ్లను వినియోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలపై చర్చతో పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కేంద్రం మాత్రం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నిరాకరించింది.
నిపుణుల కమిటీ వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టు అనేక అభ్యంతరాలు ఎదుర్కొంటోంది. జలవనరుల అభివృద్ధికి సంబంధించి జీడబ్ల్యూడీటీ (GWDT), సీడబ్ల్యూసీ (CWC) సంస్థలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం పంపిన సమాచారం అసంపూర్ణంగా ఉందని, స్పష్టత లేని పథకంతో అనుమతులు ఇవ్వలేమని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టు కొనసాగింపుపై భవిష్యత్తు అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. దీని ప్రభావం రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపైనా పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వున్న నీటి వివాదాలు మరింత ముదిరే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏమవుతుందో వేచి చూడాల్సిందే.