AP Land Registration: ఏపీ లో ప్రజల భూ సమస్యలకు ముగింపు పలికిన ఆటో మ్యుటేషన్ విధానం..

ఏపీలో భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంతో సులభతరం చేస్తూ ప్రభుత్వం మళ్లీ కీలకంగా ముందడుగు వేసింది. గతంలో భూములు రిజిస్టర్ (Land registration) చేయించాలంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub Registrar Office) గంటల తరబడి క్యూలైన్లో వేచిచూడాల్సి వచ్చేది. ప్రజలు చాలా సమయాన్ని గడపాల్సి వచ్చేది. కానీ కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యలకు మార్గం చూపింది. రిజిస్ట్రేషన్‌ల కోసం “స్లాట్ బుకింగ్” (Slab booking) విధానాన్ని ప్రవేశపెట్టి, నిర్దిష్ట సమయానికే పని పూర్తయ్యేలా చేసింది. దీని వలన ఇకపై ప్రజలు పడిగాపులు
వేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
తాజాగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంటూ భూముల యాజమాన్య హక్కుల బదిలీకి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు భూమి రిజిస్ట్రేషన్ అయినా, ఆ హక్కులు కొత్త యజమానికి బదిలీ కావడానికి రోజులు పట్టేది. పాత విధానంలో, కొనుగోలు చేసిన వ్యక్తి పేరుకు మ్యుటేషన్ జరగడానికి వీఆర్వో (VRO), ఇతర ఉద్యోగుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదనే దృష్టితో సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై రిజిస్ట్రేషన్ జరిగే అదే రోజున మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది. అంటే, రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆ భూమి కొత్త యజమాని పేరుపై నమోదవుతుంది. దీనివల్ల ప్రజలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాక, వాస్తవ యజమాని పేరుతోనే ఆస్తి పన్ను చెల్లింపు కూడా జరిగేలా మార్పులు చేస్తారు. ఇది పూర్తిగా లంచాలకు అడ్డుకట్ట వేసేలా ఉంటుంది. గతంలో లంచం ఇవ్వకపోతే పనులు ముందుకు సాగవని ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇకపై ఉండవు.
ఈ విధానం ఆగస్టు 2 నుంచే అమలులోకి రానుంది. దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరగడం ఖాయం. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్లను కూడా ఇది అడ్డుకుంటుంది. భూములపై పూర్తి హక్కులు వెంటనే పొందడం ద్వారా ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా కడప (Kadapa), నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittoor) జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు ఆటో మ్యుటేషన్ విధానం వలన, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశమే లేదు. ఈ మార్పులకు ముఖ్య కారకులుగా చంద్రబాబు గారు ఉన్నారు. ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి, సాంకేతికతను వినియోగించి వ్యవస్థను సవ్యంగా మార్చడంలో ఆయన చూపిన దూరదృష్టి ప్రజలు మెచ్చుకుంటున్నారు.