Nara Lokesh: ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం
గత అయిదేళ్ల అరాచకపాలనలో ఆటోడ్రైవర్లను ఇబ్బందుల పాల్జేశారు
యువగళంలో ఇచ్చిన హామీ మేరకు ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం
మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం
అమరావతి: గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలుపుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీగారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు అద్భుతంగా పనిచేస్తుండటం వల్లే ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నాం. ఇది మీ అందరి ప్రభుత్వం… మళ్ళీ వస్తాం… మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా… ఆటో ఎక్కిన వారిని నవ్వుతూ పలకరించేది ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర రాజకీయాల వరకూ చర్చించేది ఆటోలోనే అని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పోయిన ఐదేళ్లు ఎంత అరాచక పాలన చేశారో చూసాం.. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వై నాట్ 175 కాస్త కేవలం 11 అయ్యింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య.. నా ముద్దుల మావయ్య డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. పవనన్న డ్రైవర్ గా నటించిన సినిమా అత్తారింటికి దారేది. అన్న ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్సు వేసి చైతన్యరథంపై తిరిగితే ఢిల్లీ గడగడ లాడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆటో డ్రైవర్ల కష్ఠాలు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆటో డ్రైవర్లకు సహాయం అందిస్తూనే ఉన్నారు. వారి కష్టాలు తీర్చేందుకే ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించింది.
ఒక ఆటో వెనుక రాసిన కొటేషన్ నాకు బాగా నచ్చింది. “వర్షం ఎలా పడుతుంది అని మీ పిల్లలు అడిగితే..దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు… ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం పడుతుంది అని చెప్పండి..”అనే కొటేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఒక ఆటో డ్రైవరన్న ప్రచారం చేస్తున్నాడు. అందరూ బాగుండాలి…అందులో నేనుండాలి. జరభద్రం భయ్యా..మనమంతా క్షేమంగా ఇంటికి చేరాలి వంటి ఆటో వెనుక కొటేషన్లు లాగానే వారు తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. పెద్దమనసున్న వ్యక్తులు ఆటోడ్రైవర్లు. ఆటోలో బ్యాగు మరిచిపోయి వెళ్లిపోతే….వెతికి మరీ అప్పగిస్తున్నారు. మొబైల్ వదిలిపోతే… తిరిగి ఇస్తున్నారు. విలువైన వస్తువులను పోలీసులకు అప్పగిస్తున్నారు. ఆటో యూనియన్ల ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆటో వెనుక ఉండే నవ్వు తెప్పించే ఆహ్లాదకరమైన కొటేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. అప్పుచేసి కొన్నానురా… నన్ను చూసి ఏడవకురా.. Hi అని ఆశపెట్టకు.. bye అని బాధ పెట్టకు… వంటివి చాలా సరదాగా ఉంటాయి. ఎన్ని సమస్యలున్నా… ఎన్ని కష్టాలున్నా… నవ్వుతూ ప్రయాణీకులను ఆదరిస్తారు ఆటోడ్రైవర్లు. యువగళం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో సమావేశమై వారి సమస్యలు, కష్టాలు తెలుసుకున్నాను. కామన్ మ్యాన్ కార్ ఆటో… వానొస్తే తడవకుండా ఇంటిదగ్గర దింపేది మీరే. గత వైసిపి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. కుడి చేత్తో పది ఇచ్చి ఎడమ చేత్తో వంద లాగేశారు. వైసీపీ ఐదేళ్లలో పాలనలో గుంతలలో పడి ఆటోలకు జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు. పోయిన ప్రాణాలు ఎన్నో? ఆటోల రిపేర్లకు వేలకు వేలు ఖర్చు చేయలేక ఆటోలు అమ్ముకున్నారు. గతంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాదేశారు. వైసిపి హయాంలో గుంతలు పూడ్చే దిక్కు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పవనన్న నేతృత్వంలో రూ.3వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చాము. పాత వాహనాలపై ఉన్న గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేలను రూ.3 వేలకు తగ్గించాం. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆటో స్టాండ్లలో చార్జింగ్ పాయింట్, వాటర్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
అప్పట్లో మంత్రి రోజా గారు మహిళల్ని కించపరిచేలా మాట్లాడారు. ఆమెకు చీర,గాజులు ఇచ్చి నిరసన తెలిపేందుకు తెలుగు మహిళలు ఆటోలో వెళ్లారు. ఆటోలో మహిళలను తీసుకెళ్లిన హమీద్ బాషాకి చెందిన ఆటోని పోలీసులతో మంత్రి రోజా సీజ్ చేయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు గారికి చెబితే ఎలాంటి సాయమైనా చేసి హామీద్ ను ఆదుకోవాలని చెప్పారు. సామాన్యుడి కారు ఆటో, వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది ఆటో డ్రైవర్లు. పిల్లల్ని భద్రంగా స్కూలుకి తీసుకెళ్లి తెచ్చేది మీరే…అనారోగ్యమైతే అంబులెన్సులా మారి ఆస్పత్రికి తీసుకెళ్లేది ఆటోవాళ్లే. పనికి వెళ్లాలన్నా, ఆఫీసుకు చేరుకోవాలన్నా, బస్సూ, రైలు ప్రయాణాలకు ఫీడర్ వెహికల్ ఆటో మాత్రమే. మీరు ఆటో తోలడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. మీ రుణం తీర్చుకునేందుకే ఈ పథకం పేరు `ఆటో డ్రైవర్ల సేవలో ` అని పెట్టాం. కార్మికులు, డ్రైవర్లు భక్తిశ్రద్ధలతో తమ వాహనాలు పూజలు చేసి, ఆనందంగా దసరా పండుగ చేసుకున్నారు. దసరా అయిన 3 రోజుల్లోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కో డ్రైవరుకు రూ.15000 ఇస్తున్నాం. సుమారు 3లక్షలమందికిడ్రైవర్లకు ఈ పథకం కింద రూ.436 కోట్లు అందిస్తున్నాం.
ఆవకాయ్ పట్టాలన్నా , అంతరిక్షానికి వెళ్లాలన్నా, ఆటో తోలాలి అన్నా మహిళలే. నేను ఈ వేదిక కు వచ్చిన ఆటోను డ్రైవ్ చేసింది మహిళా ఆటో డ్రైవర్ స్వర్ణలత. ఆమె ఇంట్లో కష్టాలు నేను తెలుసుకున్నా. మగవాళ్లకన్నా ఆ అక్కే అద్భుతంగా ఆటోనడిపింది. స్వర్ణలత ఆటోతోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంట్లో ఆమె భర్త సహకరిస్తున్నారు. కలసికట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పిల్లల్ని బాగా చదివించు కుంటున్నారు. కూటమి ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆవిడకు అందాయి. తల్లికి వందనం వచ్చింది, దీపం పధకంలో సిలెండర్లు వచ్చాయి, వారి అత్తగారికి ప్రజాప్రభుత్వంపెన్షన్ ఇస్తుంది. మహిళల్ని గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది. మహిళలను కించపర్చేపదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాంటి పదాల వాడకూడదు. మహిళలను గౌరవించడంపై ప్రతి ఆటోడ్రైవర్ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.