Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు లెక్కకు మిక్కిలిగా పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు రాజధాని అమరావతితో పాటు ఇతర అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రతి నెలా పెరుగుతున్న ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయక తప్పట్లేదు. దీంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందనే విమర్శలు కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయినా చంద్రబాబు మాత్రం వెనక్కు తగ్గట్లేదు. హామీ ఇవ్వకపోయినా సంక్షేమ పథకాల అమలులో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతటి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో చాలావాటిని ఇప్పటికే అమలు చేసి, తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించదు, చెప్పిన హామీలను చంద్రబాబు అమలు చేయలేరు, చేతులెత్తేస్తారు.. అని విమర్శించిన వారికి దీటుగా సమాధానం చెప్పారు. సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, స్త్రీ శక్తి లాంటి పథకాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోంది.
అంతేకాక ఎన్నికల ముందు హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేసి, చంద్రబాబు ప్రభుత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో.. (Auto Driverla Sevalo..) పథకం దీనికి ఉదాహరణ. రాష్ట్రంలోని సొంత ఆటో, క్యాబ్, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. వాస్తవానికి, ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఈ హామీ ఇవ్వలేదు. పైగా, గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాహనమిత్ర పేరిట ఆటో డ్రైవర్లకు రూ.10,000 ఆర్థిక సాయం అందించేది. ఇప్పుడు అంతకుమించి రూ.5,000 అదనంగా అంటే రూ.15,000 ఇస్తూ, తాము సంక్షేమంలో ముందుంటామని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గిరాకీ తగ్గి ఆదాయంపై ప్రభావం పడిందని గుర్తించిన ప్రభుత్వం, వారి ఆవేదనను అర్థం చేసుకుని ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.400 కోట్లకు పైగానే భారం పడుతున్నా, సంక్షేమాన్ని విస్మరించే ప్రసక్తే లేదని చంద్రబాబు చాటిచెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే, సంక్షేమం- అభివృద్ధిని (welfare and development) బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా తక్షణ ఉపశమనం అందిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, మరోవైపు రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా రాష్ట్రాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిపక్షం నుంచి అప్పుల కుప్ప అనే విమర్శలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం తన లక్ష్యాల నుంచి పక్కకు జరగకుండా, తనదైన శైలిలో సామాజిక భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అవసరాలు, సంక్షేమ ఆకాంక్షల ముందు ఆర్థిక సవాళ్లను సైతం లెక్కచేయకుండా ముందుకెళ్లే ధైర్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధోరణి రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది వేచి చూడాలి.