Yogi Style: ఏపీలో ‘యోగి’ మార్క్ పోలీసింగ్..!
ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో సరికొత్త శాంతిభద్రతల శకానికి నాంది పలుకుతున్నాయి. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు.. అవసరమైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో కఠిన నిర్ణయాలు తీసుకుంటాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో అక్షరాలా అమలు అవుతున్నట్లు కనిపిస్తోంది. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ, సామాన్యుల్లో భరోసా నింపేలా ఏపీ పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు హద్దులు దాటి ప్రవర్తించాయి. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీపై దాడికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. నిందితులను పట్టుకోవడమే కాకుండా, వారిని వీధుల్లో నడిపిస్తూ పోలీసులు నిర్వహించిన ర్యాలీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు వీధుల్లో హంగామా చేసిన అదే వ్యక్తులు, పోలీసుల “ట్రీట్మెంట్” తర్వాత సరిగ్గా నడవలేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, నేరం చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయనే బలమైన హెచ్చరిక.
ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ నేరగాళ్ల ఆస్తులపై బుల్డోజర్లను ప్రయోగిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల ఒక అత్యాచార కేసులో నిందితుడికి చెందిన అక్రమ నిర్మాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. నేరం చేస్తే జైలుకు వెళ్లడమే కాదు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు కూడా హరించుకుపోతాయనే భయం నేరగాళ్లలో మొదలైంది.
నెల్లూరు, తిరుపతి, కర్నూలు, విజయవాడ నగరాల్లో పోలీసులు రౌడీ షీటర్ల పాత రికార్డులను తిరగదోడుతున్నారు. కేవలం స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, వారిని బహిరంగంగా వీధుల్లో తిప్పుతూ ప్రజల ముందు పరేడ్ చేయిస్తున్నారు. పాత నేరస్థులు మళ్లీ తోక జాడిస్తే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని పోలీసులు నేరుగా హెచ్చరిస్తున్నారు. ఈవ్ టీజింగ్, గంజాయి విక్రయాలు, మహిళలపై దాడులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెంచారు. విజయవాడలో గంజాయి బ్యాచ్‌లను పట్టుకుని వారికి బహిరంగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
గత ఐదేళ్లలో వ్యవస్థలను మేనేజ్ చేశామనే ధీమాతో ఉన్న కొందరు నాయకులకు ప్రస్తుత ప్రభుత్వం గట్టి సందేశం పంపింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి నుంచి మొదలుకొని, హత్యాయత్నాలకు పాల్పడే వారి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా పోలీసులపై చేయి చేసుకున్న వారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని చట్టం ముందు నిలబెట్టడంలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఒక రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా అక్కడ శాంతిభద్రతలు అత్యంత ముఖ్యం. “లా అండ్ ఆర్డర్” కఠినంగా లేకపోతే అరాచక శక్తులు రెచ్చిపోతాయి. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ “యోగి స్టైల్ ట్రీట్మెంట్” పట్ల సామాన్య ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపుగా మారకుండా, కేవలం నేరగాళ్లను అదుపు చేసే సాధనంగానే ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ పాత పంథాను వీడి “యాక్షన్ మోడ్”లోకి వచ్చారు. బుల్డోజర్ల గర్జనలు, నిందితుల వీధి నడకలు రాష్ట్రంలో నేరాల గ్రాఫ్‌ను తగ్గించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. తప్పు చేస్తే ‘తగిన శాస్తి’ తప్పదనే సంకేతం గట్టిగా వెళ్లడంతో, అసాంఘిక శక్తులు ఇప్పుడు అండర్ గ్రౌండ్‌కు వెళ్తున్నాయి.






