Janasena: జనసేనకు కొత్త జీవం.. పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగు
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan)… కొన్నాళ్లుగా పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితమయ్యారు. శాఖల సమీక్షలు, కొత్త పాలసీలు, అధికారులతో సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. అయితే, ఇప్పుడు ఆయన దృష్టి పార్టీ వైపు మళ్లింది. అధికారం ఉంది కదా అని పార్టీని గాలికొదిలేయకుండా, ప్రభుత్వంలో పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేస్తూనే, క్షేత్రస్థాయిలో పార్టీ వేళ్లను బలంగా నాటడానికి పవన్ కల్యాణ్ ఒక సరికొత్త వ్యూహానికి తెరలేపారు. అదే జనసేన- పంచసూత్ర.
జనసేన (Janasena) పార్టీని గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పవన్ కల్యాణ్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీల విధానాన్ని ప్రకటించారు. దీనినే రాజకీయ విశ్లేషకులు పంచతంత్రంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు జనసేనకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, సంస్థాగత నిర్మాణం అక్కడక్కడా లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. వాటిని సరిదిద్దేందుకే ఈ కొత్త కమిటీల నియామకం చేపడుతున్నారు.
ముఖ్యంగా గ్రామ పంచాయతీ, మండలం, అసెంబ్లీ, పార్లమెంట్.. ఇలా ప్రతి దశలోనూ ఐదుగురు క్రియాశీలక సభ్యులతో కమిటీలు వేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వడంతో, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ కమిటీల్లో కేవలం పాత నాయకులకే కాకుండా, మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించాలని పవన్ ఆదేశించారు. ప్రతి ఐదుగురు సభ్యుల కమిటీలో కనీసం ఒకటి లేదా రెండు స్థానాలను వీరమహిళలకు కేటాయించడం ద్వారా పార్టీలో మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీకి మహిళా ఓటు బ్యాంకును స్థిరపరచడంలో కీలక పాత్ర పోషించనుంది.
కేవలం జెండాలు మోయడమే కాకుండా, తమ ప్రాంత అభివృద్ధిలో క్యాడర్ భాగస్వామ్యం కావాలన్నది పవన్ ఆలోచన. స్థానికంగా ఉండే మౌలిక వసతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల్లో ఈ కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి. అంటే, ఒకవైపు పార్టీ నిర్మాణం, మరోవైపు ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం.. ఇలా ద్విముఖ వ్యూహంతో పవన్ ముందుకెళ్తున్నారు. మరోవైపు, అధికారంలోకి వచ్చాక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజం. పదవుల కోసం, ఆధిపత్యం కోసం వచ్చే గొడవలను తక్షణమే పరిష్కరించేందుకు వివాదాల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి పనిచేసే ఈ 11 మంది సభ్యుల బృందంలోనూ ముగ్గురు మహిళలకు చోటు కల్పించడం విశేషం.
పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన సత్తా చాటాలంటే క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం అవసరం. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ చిత్తశుద్ధితో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం ద్వారా, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
మొత్తంగా చూస్తే, పవన్ కల్యాణ్ కేవలం ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా, ఒక పరిణతి చెందిన రాజకీయ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, జనసేనను ఒక స్వతంత్ర శక్తిగా, వ్యవస్థాగతంగా బలంగా మార్చడానికి ఆయన వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్ రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపనున్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడే పార్టీని పటిష్టం చేసుకోవాలన్న ఆయన ముందుచూపు, రాబోయే ఎన్నికలకు జనసేనను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తోంది.






