Jagan – BJP: జగన్‌తో బీజేపీ రహస్య స్నేహం కొనసాగుతోందా..? ఇదేనా సాక్ష్యం..!?

భారతదేశంలో ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు (Liquor Scams) వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కుంభకోణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా విచారణ జరుపుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం కుంభకోణంపై మాత్రం ఈ సంస్థలు అస్సలు జోక్యం చేసుకోలేదు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కుంభకోణం విలువ రూ.3,200 కోట్లపైనే ఉంటుందని సమాచారం. మిగిలిన రాష్ట్రాల కుంభకోణాలతో పోల్చితే చాలా ఎక్కువ. అయినా కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవట్లేదంటే వైసీపీతో బీజేపీ దోస్తేయే కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో రూ. 2,161 కోట్ల మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. 2019-2022 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా, ఇతర అధికారులు, వ్యాపారవేత్తలు కూడా అరెస్టయ్యారు. ఇందులో చైతన్య బఘేల్ కూడా లబ్ధిదారుడని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన రూ.100 కోట్ల మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో ఆప్ నాయకులు రూ. 100 కోట్ల లంచం తీసుకున్నారని, దక్షిణ భారతదేశంలోని కొందరు వ్యాపారవేత్తలతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. తమిళనాడులోనూ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. డీఎంకే నాయకులపై రూ. 1,000 కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో జరిగిన మద్యం కుంభకోణం రూ. 3,200 కోట్లకు పైగానే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర ఈ కుంభకోణం ఢిల్లీ కేసు కంటే భారీగా ఉందని, అక్రమ లాభాల కోసం స్థానిక మద్యం బ్రాండ్లను ప్రోత్సహించినట్లు ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ప్రకారం, ఈ కుంభకోణంలో రాజ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక వ్యక్తులు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు అరెస్టు కాగా మరికొందరిని సిట్ విచారించింది. దాదాపు 41 మందితో ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమైంది.
అయితే, ఈ కేసుపై ఈడీ, సీబీఐ స్పందించకపోవడం, విదేశీ సంస్థలతో లావాదేవీలు ఉన్నా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇటీవల లేవనెత్తారు. మే 2025లో ఈడీ ఒక మనీలాండరింగ్ కేసు నమోదు చేసినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేదా ఇతర వైసీపీ నాయకులపై నేరుగా చర్యలు తీసుకోలేదు. ఇది బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలపై అనుమానాలను రేకెత్తిస్తోంది. టీడీపీ, జనసేనలతో కూటమిలో ఉన్న బీజేపీ, జగన్‌పై చర్యలు తీసుకోకుండా కాపాడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు మౌనంగా ఉండటం గమనార్హం. ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలను తెలియజేస్తోంది. వైసీపీని బీజేపీ తెరవెనుక ప్రోత్సహిస్తోందని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేనలకు ఇబ్బందులు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.