YS Jagan: ఎగిసిన కెరటంలా జగన్..! ఏడాదిలోనే ఫుల్ యాక్టివ్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2024 ఎన్నికలు (2024 elections) ఒక మలుపుగా నిలిచాయి. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై, దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి (YS Jagan) రాజకీయంగా పెను సవాలుగా మారింది. సాధారణంగా ఇటువంటి ఘోర ఓటమి తర్వాత ఏ పార్టీ అయినా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. 2019లో ఓడిపోయిన టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) యాక్టివ్ కావడానికి సుమారు మూడేళ్ల సమయం పట్టింది. కానీ, జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఈ ఓటమిని త్వరగా జీర్ణించుకుని, ఏడాది వ్యవధిలోనే పార్టీని యాక్టివేట్ చేశారు.
2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించగా, వైసీపీ కేవలం 11 సీట్లతో అధికారం కోల్పోయింది. ఈ ఓటమి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అధికార వ్యతిరేకత, ఉద్యోగాలు లేకపోవడం, అమరావతి రాజధాని విషయంలో వివాదాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వ్యతిరేకత వంటి అంశాలు వైసీపీకి చేటుగా మారాయి. అయినప్పటికీ, జగన్ ఈ ఓటమిని ఒక సవాలుగా స్వీకరించి, పార్టీ కేడర్‌ను ఉత్తేజపరిచే ప్రయత్నాలను వేగవంతం చేశారు.
ఓటమి తర్వాత బెంగళూరులో ఎక్కువ సమయం గడుపుతున్నారని జగన్‌పై విమర్శలు వచ్చినప్పటికీ, ఆయన తన రాజకీయ కార్యకలాపాలను ఆపలేదు. గత ఏడాదిలో జగన్ పలు సందర్భాల్లో జనంలోకి వెళ్లారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి నిత్యం కార్యక్రమాలను ప్రకటిస్తూ, కార్యకర్తలను యాక్టివ్ గా ఉంచుతున్నారు. జగన్ యాక్టివ్‌గా ఉండటం వల్ల పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో జగన్ కార్యక్రమానికి పరిమిత స్థాయిలో అనుమతి లభించినా పెద్దఎత్తున కార్యకర్తలను సమీకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి చర్యలు జగన్‌లోని పట్టుదలను తెలియజేస్తున్నాయి.
జగన్ రాజకీయ వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం- సోషల్ మీడియా వినియోగం. ఓటమి తర్వాత కూడా జగన్ సోషల్ మీడియా వేదికల ద్వారా తన అభిప్రాయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తూ, పేపర్ బ్యాలెట్ విధానానికి తిరిగి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇలాంటివి రాజకీయ చర్చను రేకెత్తించాయి. చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిత్యం పలు అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఓటమి వల్ల కేడర్ పార్టీకి దూరం కాకుండా కాపాడుకోవడం, ప్రజల్లో తనపట్ల సానుభూతి తెచ్చుకోవడంపై జగన్ మళ్లీ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే నిత్యం జనంలో ఉండేందుకు, తన పాలనలోని గొప్పతనాన్ని వివరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాక మున్ముందు జనంలోకి పెద్దఎత్తున వెళ్లేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఎన్నికల ముందు అవసరమైతే పాదయాత్ర చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రస్తుతం జగన్ చూపిస్తున్న చొరవ పార్టీని యాక్టివ్గా ఉంచడంలో విజయవంతమైనప్పటికీ, దీర్ఘకాలిక విజయం సాధించాలంటే, మరింత వ్యూహాత్మకమైన ప్రణాళికలు, ప్రజలతో బలమైన అనుబంధం అవసరం.