Minister Lokesh: ఏపీలో మొంథా నష్టం రూ.6,352 కోట్లు.. అమిత్ షాకు వివరించిన మంత్రి లోకేశ్
ఇటీవల సంభవించిన మొంథా తుఫాను వల్ల ఏపీలో అన్నిరంగాలకూ కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ (Minister Lokesh) , హోం మంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) వివరించారు. అమిత్ షాతో పార్లమెంటు (Parliament)లోని ఆయన కార్యాలయంలో లోకేశ్, అనిత భేటీ అయి మొంథా తుఫాను నష్టంపై నివేదిక అందజేశారు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎ్ఫ మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అవసరమని అన్నారు. గత నెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్రమంత్రుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని లోకేశ్ పేర్కొన్నారు.






