ఆంధప్రదేశ్ దేశానికే ఆదర్శం
కరోనా నివారణలో ఆంధప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హోం మంత్రి సుచరిత అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ వలస కూలీలను ఒకేసారి తరలించడం సాధ్యం కాదని, దశలవారీగా తరలిస్తున్నామని చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న వారిని వెంటనే తరలిస్తున్నామని, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరుగుతోందని, కారకులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని సృష్టం చేశారు. విశాఖ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. అవసరమైతే పరిశ్రమను తరలించడానికి ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమం ఆపాలని సూచించారు. ప్రమాదాలను సైతం రాజకీయం చేయడం తగదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి, సమీప గ్రామాల ప్రజలకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించామని వివరించారు. రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఓవైపు దుకాణాలు, తగ్గిస్తూ, మరో వైపు ధరలు పెరుగుదల ద్వారా మద్యం ప్రవాహాన్ని అదుపు చేస్తున్నట్లు తెలిపారు.






