Pawan Kalyan: గ్రామ స్వరాజ్యానికి పవన్ కల్యాణ్ కొత్త ఊపిరి..!!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాలనా చరిత్రలో డిసెంబర్ 4, 2025 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దశాబ్దాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో (Panchayatiraj system) ఉన్న ఒక అతిపెద్ద లోపాన్ని సరిదిద్దుతూ, రాష్ట్రవ్యాప్తంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (DDO) కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇది కేవలం కొన్ని కొత్త ఆఫీసుల ప్రారంభోత్సవం మాత్రమే కాదు. ఇది ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సుదీర్ఘ ఆలోచన, పట్టుదల, గ్రామీణ భారతం పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నినాదానికి నిజమైన అర్థం చెప్పే దిశగా పవన్ వేసిన విప్లవాత్మక అడుగు ఇది.
సాధారణంగా పాలకులు ఉన్న వ్యవస్థను అలాగే నడిపించడానికి ఇష్టపడతారు. కానీ, పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండే వ్యవస్థలోని లోపాలను వెతకడం మొదలుపెట్టారు. రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయిలో ఆర్డీవో (RDO) ఉంటారు, పోలీసు శాఖలో డీఎస్పీ (DSP) ఉంటారు. ఈ ఇద్దరూ తమ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులను పర్యవేక్షిస్తుంటారు. కానీ, ప్రజలకు అత్యంత అవసరమైన సేవలు అందించే పంచాయతీరాజ్ శాఖలో మాత్రం జిల్లా (ZP CEO/DPO) తర్వాత నేరుగా మండలం (MPDO) మాత్రమే ఉండేవారు. మధ్యలో పర్యవేక్షణ లోపించడం వల్ల పాలన కుంటుపడుతోందని పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఈ అంతరాన్ని పూడ్చడానికి ఆయన చేసిన మేధోమథనం ఫలితమే ఈ డీడీవో (DDO) వ్యవస్థ.
కొత్త పోస్టులు సృష్టించడం, కొత్త కార్యాలయాలు తెరవడం ఆర్థికంగా ప్రభుత్వానికి భారం కావచ్చు. కానీ, పాలన ప్రజలకు చేరువ కావాలంటే ఈ ఖర్చు పెట్టుబడి మాత్రమే అవుతుందని పవన్ భావించారు. అధికారులతో అనేక దఫాలుగా చర్చించి, ఆర్థిక శాఖ అనుమతులు సాధించి, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 54 మంది డీడీవోలను నియమించడం ఆయన కార్యదక్షతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ సమస్యలు జిల్లా కేంద్రం వరకు వెళ్లకుండా, డివిజన్ స్థాయిలోనే పరిష్కారం కావాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష. అందుకే తను స్వయంగా దగ్గరుండి ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో కచ్చితమైన మార్పులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న పరిపాలనా అనుమతుల కోసం కూడా ఫైళ్లు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కమిషనర్ స్థాయి అధికారాలను ఇప్పుడు డీడీవోలకు బదలాయించారు. దీనివల్ల నిర్ణయాలు వేగంగా జరుగుతాయి. మండల స్థాయి అధికారులైన ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీల పనితీరుపై ఇప్పుడు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న జవాబుదారీతనం (Accountability) దీని ద్వారా సాధ్యమవుతుంది. ఆర్డీవో, డీఎస్పీలతో సమాన హోదా కలిగిన అధికారి పంచాయతీరాజ్ శాఖ తరఫున ఉండటం వల్ల… శాంతి భద్రతలు, భూ సంబంధిత సమస్యలు, అభివృద్ధి పనుల్లో ఇతర శాఖలతో సమన్వయం సులభమవుతుంది.
సాధారణ రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు తెస్తారు. కానీ, దార్శనికులు మాత్రమే భవిష్యత్ తరాల కోసం వ్యవస్థలను (Institutions) నిర్మిస్తారు. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ద్వారా తాను రెండో కోవకు చెందిన నాయకుడిని అని నిరూపించుకున్నారు. గ్రామీణ రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి కనీస అవసరాలు తీర్చడంలో అలసత్వం ఉండకూడదని ఆయన భావించారు. ఆ లక్ష్య సాధన కోసమే యంత్రాంగాన్ని ప్రజల ముంగిట నిలిపారు.
“పల్లె బాగుంటేనే దేశం బాగుంటుంది” అనే మాటను పవన్ కళ్యాణ్ కేవలం ఉపన్యాసాలకే పరిమితం చేయలేదు. డీడీవో వ్యవస్థ ద్వారా ఆ మాటకు ఒక ఆకారాన్ని, ఆచరణను జోడించారు. అధికార వికేంద్రీకరణ ద్వారా పాలనను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం, అధికారుల్లో బాధ్యతను పెంచడం ద్వారా పవన్ కళ్యాణ్ తనదైన సంస్కరణల ముద్రను వేశారు. ఏపీ గ్రామీణాభివృద్ధి చరిత్రలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.






