Pawan Kalyan: దివిసీమలో తుఫాన్ బాధిత రైతులకు అండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలి కాలంలో ప్రభుత్వ పనితీరులో చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మొంథా తుఫాన్ (Cyclone Motha) ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా దివిసీమ (Diviseema) ప్రాంతంలో పర్యటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కృష్ణా జిల్లా (Krishna District) లోని అవనిగడ్డ (Avanigadda) నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ (Buddha Prasad), ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balasouri) ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం రాజధాని అమరావతి (Amaravati) నుండి బయలుదేరి కోడూరు మండలానికి (Koduru Mandal) చేరుకున్నారు.
పవన్ అక్కడ దెబ్బతిన్న వరి పొలాలను, అరటి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను ఆత్మీయంగా విన్నారు. నీటితో మునిగిపోయిన పంటలు, బురదలో మునిగిన పొలాలు, ధ్వంసమైన సాగు సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి బురదలోకి దిగి రైతులతో మాట్లాడడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఆయన వెంట జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
రైతులు తుఫాన్ పంటను పూర్తిగా నాశనం చేసిందని, నీటిలో మునిగిపోయిన ధాన్యం ఇప్పుడు కుళ్లిపోతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పర్యటనలో ప్రతి ఒక్కరి సమస్యను విన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన పర్యటనలో ఎలాంటి హంగామా లేకుండా, నేరుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా పవన్ పర్యటన అంటే పెద్ద ఎత్తున అభిమానుల రాక, పోస్టర్లు, ర్యాలీలు కనిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. రైతుల సమస్యలను వినడంపైనే ఆయన దృష్టి సారించారు.
తిరుగు ప్రయాణంలో పులిగడ్డ (Puligadda) వద్ద రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న కూరగాయల వ్యాపారులు, కొబ్బరి బొండాల అమ్మకందారులను కలిసిన పవన్, తుపాను ప్రభావం వల్ల వారి జీవనోపాధిపై ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనతో పవన్ కళ్యాణ్ రైతుల్లో విశ్వాసాన్ని నింపారని స్థానికులు అంటున్నారు. కేవలం పరామర్శ స్థాయిలో కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకమవడం ద్వారా ఆయన కొత్త రాజకీయ శైలిని ప్రదర్శించారు. ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకునేందుకు కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు.







