Nara Lokesh: కూల్ లోకేశ్… కూల్..!!

ఆంధ్రప్రదేశ్‌లో (AP) గూగుల్ (Google) సంస్థ సుమారు 15 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇది. సహజంగానే, ఈ భారీ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహా ఏపీ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది.
ఈ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడంలో తన కృషిని లోకేశ్ గట్టిగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక ట్వీట్ పొరుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో, “They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn!” అంటూ #AndhraRising అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ముఖ్యంగా కర్ణాటక నాయకులను ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. ఎందుకంటే కొద్ది వారాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య పెట్టుబడులు, బెంగళూరు మౌలిక వసతులపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది.
నారా లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు పెట్టుబడి కోసం సుమారు రూ. 22,000 కోట్ల ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, భూమి, నీటిపై రాయితీలు ఇచ్చిందని ప్రియాంక్ గర్గ్ ఆరోపించారు. బెంగళూరు వంటి రాష్ట్రాలను వాడుకుని, పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రయత్నిస్తోందని, కానీ బెంగళూరు మౌలిక వసతులు, స్టార్టప్‌లు, మానవ వనరులకు ఎవరూ సాటి రారని ఆయన స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందంటూ విమర్శించారు. “బెంగళూరుకు ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక సౌకర్యాలను ఎవరూ కాపీ చేయలేరు. మా స్థాయికి వారు చేరుకోలేరు,” అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కొంతమంది తమను తాము మార్కెట్ చేసుకోవడానికి బెంగళూరు పేరును వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాయితీలు ఇస్తే పెట్టుబడులు ఎక్కడికైనా వెళ్తాయని, కానీ బెంగళూరు సహజసిద్ధమైన బలం, ప్రతిభకు సాటి లేదని చెప్పారు.
పెట్టుబడులను ఆకర్షించడం అనేది రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కీలకం. అయితే, ఈ ప్రక్రియలో పొరుగు రాష్ట్రాలను విమర్శించడం లేదా వారి వైఫల్యాలను ఎత్తిచూపడం అనేది రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించడం మంచిదే కానీ, ఈ తరహా రెచ్చగొట్టే ప్రకటనలు సరికాదని సూచిస్తున్నారు. ఇలాంటివి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కల్పించినా, దీర్ఘకాలికంలో అంతర్ రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపవచ్చని కొందరు అంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని లోకేశ్ కాస్త సమయస్ఫూర్తి ప్రదర్శిస్తే బాగుంటుందనేది ఆయన శ్రేయోభిలాషుల సూచన.