H1B Visa: ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై.. కోర్టుకెక్కిన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్-1బీ వీసా (H1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకెక్కింది. ఈ సంస్థ యూఎస్‌లో సుమారు 3 లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత ఈ గ్రూప్ ఆయనపై వేసిన మొదటి దావా ఇదే కావడం గమనార్హం.
సెప్టెంబరు నెలలో హెచ్1బీ వీసాల (H1B Visa) ఫీజును పెంచాలని ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ఆయన అధికార పరిధిలోకి రాదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. ఇది కాంగ్రెస్ రూపొందించిన సంక్లిష్ట వీసా వ్యవస్థను దెబ్బతీస్తుందని, హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీజు పెంపుతో వ్యాపారులు తమ కార్మిక వ్యయాలను పెంచుకోవాల్సి వస్తుందని, లేదంటే తక్కువ నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది.
ఈ చర్యతో తమ సభ్యులు హెచ్-1బీ (H1B Visa) ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్.. ఈ నిర్ణయంతో పెట్టుబడిదారులు, కస్టమర్‌లు, ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని తెలిపింది. అయితే ఈ లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తించే వన్‌టైమ్ ఫీజు అని వైట్‌హౌస్ ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే ట్రంప్ నిర్ణయాన్ని పలు ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. ఇప్పుడు ఈ జాబితాలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా చేరడం గమనార్హం.