Telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ కీలక ఆదేశాలు..!

తెలంగాణలో (Telangana) స్థానిక సంస్థల ఎన్నికల (Localbody Elections) నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించే దిశగా హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (EC) ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో చెప్పేందుకు రెండు వారాల సమయం కావాలని కోరడంతో.. హైకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో, ఎన్నికల సంఘం ఇటీవల స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. అయితే అక్కడ కూడా ప్రభుత్వానికి ఊరట లభించలేదు. హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది.
దీంతో ఇవాళ విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది కదా అని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందించారు. సుప్రీంకోర్టు కేవలం మౌఖికంగా మాత్రమే చెప్పిందని, లిఖితపూర్వక ఆదేశాల్లో ఆ ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగానే నోటిఫికేషన్ ఇచ్చామని, అయితే అది చెల్లకపోవడంతోనే నోటిఫికేషన్‌ను నిలిపివేశామని ఈసీ తరఫు న్యాయవాది వివరించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంతో చర్చించి, స్పష్టత వచ్చిన తర్వాతే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయగలమని తెలిపారు. ఈ ప్రక్రియ కోసం కొంత సమయం అవసరమని కోరారు.
ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు రెండు వారాల సమయం కోరడంతో, హైకోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ లోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై ఒక స్పష్టమైన నిర్ణయంతో రావాలని ప్రభుత్వాన్ని, ఈసీని ఉన్నత న్యాయస్థానం నిర్దేశించింది. రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాన్ని రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాల్సి ఉంది.