US Shutdown: ఉద్యోగుల తొలగింపుపై.. ట్రంప్ డెసిషన్‌కు యూఎస్ ఫెడరల్ కోర్టు స్టే!

అెమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ (US Shutdown) నేపథ్యంలో.. ఉద్యోగులను తొలగించాలనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై యూఎస్ ఫెడరల్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని డిస్ట్రిక్ట్ జడ్జి సుసాన్ ఇలిస్టన్.. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల తొలగింపు రాజకీయ దురుద్దేశాలతో, అనాలోచితంగా జరుగుతోందని న్యాయమూర్తి మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించేందుకు గత శుక్రవారం జారీ చేసిన 4,100 లేఆఫ్ నోటీసులను యూఎస్ ప్రభుత్వం (US Government) జారీచేసింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలను వివరించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగాల తొలగింపుపై తాత్కాలిక స్టే విధిస్తూ ఆదేశాలు వెలువరించిన జడ్జి ఇలిస్టన్.. ఈ చర్యలు చట్టవిరుద్ధమనేందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయంతో షట్‌డౌన్ (US Shutdown) సంక్షోభంతో ఉద్యోగాలు పోతాయనే భయంలో ఉన్న వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది.