Chandrababu: పెట్టుబడులకు మెరుగైన వేదికగా ఆంధ్రప్రదేశ్.. ఫిక్కీ నుంచి చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహకారం లభిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో అందుతూ ఉండడం, ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగడం అన్నీ కలిసి వస్తున్న అంశాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, మరో కీలక సంఘం అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముందుకు వచ్చింది.
తాజాగా విజయవాడ (Vijayawada) నగరంలో ఫిక్కీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించగా, ఆయన పాలన పట్ల ఫిక్కీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమకు ఆకర్షణగా మారాయని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా ఫిక్కీకి చెందిన పారిశ్రామిక వేత్తలు “సర్ణాంధ్ర-2047” (Sarvandhra-2047) విజన్ పట్ల ఆసక్తి చూపించారు. రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి దిశగా నడిపించేందుకు రూపొందించిన ఈ కార్యక్రమానికి తాము అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతామని హామీ ఇచ్చారు. ఈ స్పందనకు సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన వాతావరణం కల్పించామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పెట్టుబడిదారులకు పూర్తిగా భద్రత కల్పించబడుతుందని చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పారిశ్రామిక అనుమతులు త్వరితగతిన మంజూరు చేసే విధంగా సర్కార్ ముందుకు సాగుతోందని వివరించారు. ఫిక్కీ సభ్యులు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా సహకారం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మలుపు తిరగనుందని అంచనా. పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనకు కేంద్రంతో పాటు వాణిజ్య రంగం నుంచి కూడా విశ్వాసం లభించడం రాష్ట్రానికి మంచి పరిణామంగా మారుతోంది.