Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ రిక్వెస్ట్.. కుదరదన్న మోడీ..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Hasina) .. ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. భారత్ లోనే ఉంటూ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీరుపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి గానూ చాలాసార్లు ఆదేశ తాత్కాలిక సారథి యూనస్.. ఆమెను హెచ్చరించారు కూడా. భారత్ కు కూడా చాలా సార్లు విజ్ఞప్తులు చేశారు. ఏదో విధంగా దారికి తేవాలని ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించి .. తాను మోడీతో మాట్లాడినట్లు మహమ్మద్ యూనస్ తెలిపారు. లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోడీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ‘‘హసీనా కు భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’’ అని మోడీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోడీ బదులిస్తూ.. ‘‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’’ అని చెప్పినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత వెల్లడించారు.
భారత్తో స్నేహబంధం..
ఈసందర్భంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆయన మాట్లాడారు. ‘‘ఇది మా పొరుగుదేశం. భారత్తో బలమైన సంబంధాలు ఉండాలని మేం కోరుకుంటున్నాం. వారితో మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ, నకిలీ వార్తల కారణంగా మా ప్రయత్నాలకు ఎక్కడో గండి పడుతోందని అనుమానంగా ఉంది’’ అని యూనస్ పేర్కొన్నారు.
వచ్చే ప్రభుత్వంలో నేను ఉండను..
వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపైనా యూనస్ స్పందించారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగం కావాలనే ఉద్దేశం గానీ, ఆసక్తి గానీ తనకు లేవన్నారు. ఎన్నికలు సక్రమంగా జరగాలనే తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ పురోగతికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.







