Bangladesh: హసీనా ధైర్యం వెనక భారత్..?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా .. తొలిసారిగా తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్(yunus) పై ధ్వజమెత్తారు. ధ్వజమెత్తడమే కాదు.. నేనొస్తా.. నేనొస్తా.. తప్పకుండా ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటా.. సిద్ధంగా ఉండండంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాదు.. అవామీలీగ్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యూనస్ ను ఉగ్రవాదిగా సంభోందించిన హసీనా… దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అయితే మొన్నటివరకూ అప్పుడప్పుడు ప్రకటనలు చేసిన హసీనా.. ఇప్పుడు నేరుగా అంతధైర్యంగా ఎలా ప్రకటన చేయగలిగారు. ఆమె ధైర్యానికి కారణమేంటి..?
షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమెను ఢిల్లీలోని గుర్తు తెలియని సురక్షిత స్థలంలో మోడీ సర్కార్ ఆశ్రయం కల్పించింది. అయితే హసీనాను తిరిగి బంగ్లాదేశ్ రప్పించి.. శిక్షించాలని ప్రస్తుత అధ్యక్షుడు యూనస్ సర్కార్ భావిస్తోంది. వరుసగా అవామీ(awami)లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తూ.. వారిని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు.. ఆమెను అప్పగించాలంటూ భారత్ పైనా ప్రత్యక్షంగా , పరోక్షంగా ఒత్తిడి తెస్తోేంది. అయితే వీటన్నింటినీ గమనిస్తూ. సమయం కోసం మోడీ సర్కార్ వేచి చూసిందని చెప్పొచ్చు.
లేటెస్టుగా అమెరికాలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఈవిషయంలో అమెరికా నుంచి మద్దతు కోరారు. అంతేకాదు.. సాక్షాత్తూ ట్రంప్ సైతం.. తమకు బంగ్లాదేశ్ విషయంలో పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఈ విషయాన్ని మొదటి నుంచి మోడీ చూస్తున్నారని.. ఆయనే చర్యలు తీసుకుంటారన్నారు. అంటే ప్రపంచ పెద్దన్నను భారత్ తమపక్షాన నిలిచేలా చేసింది. ఇక రష్యా, యూరప్.. వీటికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఇక్కడ లబ్ధి, ప్రయోజనం కలిగే పరిస్థితులు లేవు.
దీంతో ఇప్పుడు హసీనాకు భారత్ నుంచి ఏమైనా హామీ దొరికిందా..? వేరే దేశంలో ఆశ్రయం పొందుతున్న హసీనా ఇలాంటి ఘాటు విమర్శలు చేసే స్థితిలో ఉన్నారా అంటే లేదని చెప్పాలి. అయితే మోడీ సర్కార్ నుంచి లభిస్తున్న మద్దతుతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలకు బంగ్లా సర్కార్ ఎలా స్పందింస్తుంది. పొరుగున ఉన్న చైనా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఆసక్తికరంగా మారాయి.






