YS Jagan: ‘మారాలి జగన్.. రావాలి జగన్..’ అంటున్న వైసీపీ కేడర్

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన ఒక దుర్ఘటన. ఈ సందర్భంలో బాధితులకు సంఘీభావం తెలపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) కొవ్వొత్తుల ర్యాలీ (Candle Rally) నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ ర్యాలీలో ఆయన స్వయంగా పాల్గొనకపోవడం విమర్శలకు దారి తీసింది. పైగా ఈ దాడిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు చనిపోయారు. వాళ్ల భౌతిక కాయాలు విశాఖపట్నం (Vizag), కావలికి (Kavali) చేరుకున్నాయి. కనీసం అక్కడికెళ్లి వాళ్లకు నివాళి అర్పించేందుకు కూడా జగన్ ప్రయత్నించలేదు. ఇవేవీ తనకు సంబంధం లేదన్నట్టు సాయంత్రం తాడేపల్లి (Tadepalli) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్లిపోతున్నారు. ఆయన తీరు విమర్శలకు దారి తీస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీలు జరిగాయి. జగన్ కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ కేడర్ రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించింది. అయితే తాడేపల్లిలో ఉన్నా కూడా జగన్ ర్యాలీలో పాల్గొనలేదు. ఇది విమర్శలకు కారణైంది. మరోవైపు ఈ దాడిలో విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) విశాఖ వెళ్లి చంద్రమౌళికి నివాళి అర్పించారు. మధుసూదన్ రావుకు నివాళి అర్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy. CM Pawan Kalyan) వెళ్తున్నారు. కానీ జగన్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు.
పైగా తాడేపల్లి నుంచి ఆయన ఈ సాయంత్రం బెంగళూరు వెళ్తున్నారు. ఇది మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. “కనీసం శాంతి ర్యాలీలో పాల్గొన్నావా జగన్? రాష్ట్రాన్ని వర్గాల వారీగా ముక్కలు చేయడం వచ్చు కానీ, దేశ సుస్థిరత కోసం కలిసి రావా?” అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలోనే కొందరు నేతలు జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకునేందుకు ఇలాంటి సంక్షోభ సమయాలు ఎంతో దోహదపడతాయని, కానీ జగన్ వాటిని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ప్రజల మధ్య ఉండి సానుభూతి చూపడం రాజకీయ నాయకుడి బాధ్యత అని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జనంలోకి వస్తారని ప్రశ్నిస్తున్నారు.
గతంలో జగన్ ఎక్కువగా ప్రజలతోనే గడిపేవారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ‘పాదయాత్ర’ ద్వారా ప్రజలతో సన్నిహితంగా మెలిగారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి ప్రజాసంబంధాలు కొనసాగించలేకపోయారు. మళ్లీ జగన్ అలాంటి వైఖరి అవలంబించాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓటమి కష్టాల్లో ఉన్న వైసీపీని గట్టెక్కించాలంటే ప్రజల మధ్యనే ఎక్కువగా గడపాలని సూచిస్తున్నారు.