Supreme Court: 12 కోట్లు, బీఎండబ్ల్యూ కారు, షాక్ అయిన చీఫ్ జస్టీస్
ఈ మధ్యకాలంలో మహిళల వ్యవహార శైలి మగవారికి తలనొప్పిగా మారుతుంది. భర్తల విషయంలో కొంతమంది భార్యలు కఠినంగా వ్యవహరిస్తుంటే విడాకులు తీసుకున్న మరికొందరు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ల డిమాండ్ల దెబ్బకు న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు భారీ ఎత్తున భరణం డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని కోర్టు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నెలవారీ ఖర్చుల పేరుతో భారీగా మహిళలు డబ్బు డిమాండ్ చేయడంతో న్యాయమూర్తులు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మానవతా కోణంలో ఆలోచించాలంటూ సూచనలు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ ఏకంగా 12 కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముంబై(Mumbai)లో ఒక ఇల్లు తో పాటుగా బీఎండబ్ల్యూ(BMW) కారు, 12 కోట్ల రూపాయల నగదు ఇవ్వాలని కోరింది.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఆమె తీరును తప్పు పట్టారు. అంత నగదు ఎందుకని ఆమెను ప్రశ్నించారు. తన భర్త తన నుంచి విడాకులు కావాలని కోరుకున్నాడని, తన మానసిక ఆరోగ్యం బాగాలేదని ఆమె కోర్టుకు తెలిపింది. వైద్య ఖర్చుల నిమిత్తం తనకు 12 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి నాలుగు కోట్ల రూపాయల నగదు, అలాగే ముంబైలో ఇల్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. ఈ మేరకు ఆర్డర్ ను రిజర్వ్ చేశారు న్యాయమూర్తి.
తన భర్తకు భారీగా ఆదాయం ఉందని ఆమె కోర్టు ముందు వాదించినా ఉపయోగంలేకపోయింది. ఉన్నత చదువులు చదువుకుని, స్వంతగా సంపాదించుకునే సామర్ధ్యం ఉన్నప్పటికీ భరణంపై ఆధారపడటం ఏంటని ఆయన నిలదేసారు. తన భర్త కారణంగానే తాను వివాహం తర్వాత ఉద్యోగం మానేసాను అని ఆమె వాదించింది. అలాగే తన బిడ్డను కూడా తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన సరే.. న్యాయమూర్తి ఆమె వాదనను కొట్టేశారు. ఉద్యోగం చేసుకోవాలని ఆమెకు సూచించారు చీఫ్ జస్టీస్. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.






