నిరాశ, నిస్పృహల్లో చైనా యువత..
డ్రాగన్ కంట్రీ చైనా ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ కునారిల్లుతోంది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆ దేశం చేస్తున్నప్రయత్నాలు కూడా ఫలితాన్నివ్వడం లేదు. ఓవైపు రియల్ బూమ్ ఎప్పుడు ఢమాల్ అంటుందో తెలియదు. చాలా కంపెనీలు ఐపీలు పెట్టేస్థితిలో ఉన్నాయి. పోనీ వాటి ఆస్తుల్ని స్వాధినం చేసుకుని, ఏదైనాచేద్దామన్నా మళ్లీ దానికి బోలెడంత ఖర్చు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాకు అంతసీన్ లేదు.ఇక దీనికి తోడు అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆంక్షలు సైతం చైనాను గుక్క తిప్పుకోనివ్వడం లేదు.
దీనికి తోడు చైనా ప్రభుత్వం ఐరన్ కర్టెన్ వ్యవస్థలో పనిచేయడం విదేశీ కంపెనీలకు కష్టతరంగా మారుతోంది. దీంతో చాలా కంపెనీలు అక్కడ నుంచి రెక్కలు కట్టుకుని ఇతర దేశాలకు తరలిపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి సైతం తగ్గుతోంది. ఇక దేశీయ పరిశ్రమల్లో ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో డిగ్రీలు చేసి బయటకు వస్తున్న విద్యార్థులను బతుకు భయం వేధిస్తోంది. గతంలో చాలాసార్లు వాళ్లు … డెడ్ బాడీస్ లా ఫోటోల్లో కనిపిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనికి చైనా సర్కార్ ఇచ్చిన సమాధానం.. పల్లెలకు పోయి పనిచేసుకోండి. గతంలో మావో హాయాంలో ఇలాంటి నినాదాలు ఫలితాన్నిస్తాయి కానీ.. లక్షలు ఖర్చుపెట్టి డిగ్రీలు చేసి, పల్లెకు పోయి వ్యవసాయ అనుబంధ పనులు చేసుకొమ్మంటే .. అక్కడి విద్యార్థులకు మండిపోతోంది.
ఇక ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓవైపు కంపెనీలుపోయి ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో…996 విధానంలో పనిచేయాలనడం కష్టంగా మారింది. వారంలో ఆరు రోజులు పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉద్యోగులు పనిచేయాలనేది డ్రాగన్ ప్రభుత్వ పని విధానం. దీన్నే ‘996’గా స్థానికంగా పేర్కొంటారు. ఈ విధానానికి వ్యతిరేకంగా చైనాలోని యువత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది.
పని, కుటుంబ ఒత్తిళ్లు..
స్వేచ్ఛగా, ఎటువంటి అడ్డంకులూ లేకుండా జీవించడమే పక్షిగా ఉండడం వెనుక ఉన్న ఆలోచన అంటున్నారు అక్కడి యువత. ఎక్కువ గంటలు పనిచేయడం లేదా చదువుకోవడం వంటి వాటి నుంచి విముక్తి పొందడం కోసం వారు పక్షిలా నటిస్తున్నారు. ఈ నిరసనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పక్షిగా ఉంటేనే బాగుండేమో అని కొందరు ఆ యువతకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతుంటే.. పక్షులు కూడా ఆహారం సంపాదించడం కోసం కష్టపడతాయంటూ మరికొందరు పేర్కొంటున్నారు. చైనాలోని యువత సోషల్మీడియా వేదికగా తమ దేశ పని సంస్కృతిపై నిరాశను వ్యక్తం చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ పని విధానంపై ఇలా సోషల్మీడియా వేదికలపై నిరసన గళాన్ని వినిపించారు.






