Pakistan: పాకిస్తాన్ కు ఏమైంది..? అంతర్జాతీయ సమాజానికి ఇట్టే దొరికిపోతోందిగా…!

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇన్నాళ్లు పాక్ సైనికాధికారులు ముందువరసలో ఉండగా.. ఉగ్రవాదులు వెనక నుంచి ఆపరేషన్లు చేసేవారు. అయితే సిందూర్ తర్వాత పాక్ సైన్యంలో భయం, నిరాశా, నిస్పృహలు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో పాక్ సైన్యాధికారులతో కలిసి ఉగ్రవాదులు .. ఈవెంట్లలో కనిపిస్తున్నారు. కనిపించడమే కాదు.. అంతా ఓపెన్ అయిపోయింది. ఇంకెందుకు అన్నట్లుగా చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. దీంతో ఉన్న ఆకాస్తా మబ్బుతెరల్ని .. ప్రపంచం ముందు పాకిస్తాన్ తొలగించినట్లైంది.
సిందూర్ సమయంలో పీఓకే, పాక్ లోని కీలక భాగాల్లో జరిగిన దాడుల్లో మరణించిన పాక్ సైనికులకు అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యాధికారులతో కలిసి ఉగ్రనేతలు దర్శనమిచ్చారు. దీంతో ఈ ఫోటోలను అంతర్జాతీయ సమాజం ముందు భారత్ బట్టబయలు చేసింది. అంతేకాదు.. ఇది సోషల్ మీడియా యుగం కావడంతో.. ఈ ఫోటోలు, వీడియోలో అంతర్జాతీయంగా వైరల్ అయ్యాయి. దీంతో మాకు సంబంధం లేదు మొర్రో అని పాక్ మొత్తుకుంటున్నా .. అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదు.
ఇది మరవక ముందే.. లేటేస్టుగా పాకిస్తాన్ అణుపరీక్ష వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో లష్కరే తయ్యిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి ప్రధాన కుట్రదారు అయిన సైఫుల్లా(?Saifullah) కసూరీ పాల్గొన్నారు. పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో లాహోర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్‌తో ఉగ్రవాది వేదిక పంచుకోవడం గమనార్హం. దాదాపు 20 నిమిషాలపాటు చేసిన ప్రసంగంలో భారత్‌పై కసూరీ విషం చిమ్మాడు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సేనల దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట పంజాబ్ రాష్ట్రంలోని అల్హాబాద్‌లో పలు స్మారక నిర్మాణాలు చేపడతానని అన్నాడు. ఇదే ర్యాలీలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. అతడు కూడా భారత పట్ల వ్యతిరేకతను ప్రేరేపించే ప్రసంగం చేశాడు.