బెంగాల్ అసెంబ్లీకి అపరాజిత బిల్లు ..?

బెంగాల్ డాక్టర్ హత్యాచార ఘటనానంతరం వెల్లువెత్తిన ప్రజానిరసనలు ఇంకా సద్దుమణగడం లేదు. ముఖ్యంగా మమత వైఖరిపై మెడికోలు, వైద్య విద్యార్థులు, మృతురాలైన మెడికో తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో విపక్ష బీజేపీనేతలు.. సర్కార్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలను దీదీ అన్వేషిస్తున్నారు. లేటెస్టుగా ఇలాంటి కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేలా కఠిన చట్టాలు తేవాలంటూ రెండుసార్లు ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు సీఎం మమత బెనర్జీ.. అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది..
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత బిల్లుకు ''అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండమెంట్) బిల్లు 2024''గా పేరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రెయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర సంచలనమైన నేపథ్యంలో కఠినమైన అత్యాచార వ్యతిరేక బిల్లును పదిరోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్టు మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.
కాగా, అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణశిక్ష పడేలా ఈ బిల్లు ప్రతిపాదించనుంది. మరోవైపు… ఈ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపే అవకాశాలున్నట్టు తెలిసింది. ఈనెల 3వ తేదీన అసెంబ్లీలో ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ తెలిపారు. కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి కోల్‌కతా పోలీస్ సివిక్ వాలంటీర్‌ను అరెస్టు చేశారు.