US-Russia: అగ్రరాజ్యాల స్నేహగీతం.. యూరోప్ కు అమెరికా షాక్..
అగ్రరాజ్యాలు అమెరికా(America), రష్యా (Russia) మధ్య దశాబ్దాల వైరం ఉంది. కోల్డ్ వార్ టైమ్ లో అయితే పచ్చగడ్డి వేస్తే భ్గగుమనే పరిస్థితి. మొన్నటి ఉక్రెయిన్ యుద్ధంలోనూ రష్యాకు వ్యతిరేకంగా యూరోప్ కంట్రీస్ తో కలిసి అమెరికా ఓ రకంగా పరోక్ష యుద్ధమే చేిసింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ట్రంప్.. పుతిన్ తో తనకున్న స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. అయితే అది ఎంతవరకూ వచ్చిందంటే ఇన్నాళ్లుగా మిత్రులుగా ఉన్న యూరోప్ దేశాలను కాదనేంతగా.. ఈ పరిణామం యూరోప్ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న అమెరికా.. ఐరోపా దేశాలకు షాకిచ్చింది. అనూహ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని కాదని మరీ రష్యాకు మద్దతుగా నిలిచింది. యుద్ధానికి రష్యాయే కారణమన్న వాదనను తోసిపుచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఐరోపా దేశాలతో విభేదించింది. రష్యా దురాక్రమణదారు అనడాన్ని వ్యతిరేకించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐరోపా దేశాలు సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాలను రష్యాతో కలిసి అమెరికా వ్యతిరేకించింది. రష్యాకు అనుకూలంగా భద్రతా మండలిలో తీర్మానాన్ని ఐరోపా దేశాలను కాదని మరీ ఆమోదించుకుంది.
రష్యా దురాక్రమణదారు అని, వెంటనే తమ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ యూరప్ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్‌లో రష్యాకు అనుకూలంగా.. తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. ఈ తీర్మానం 93-18 ఓట్లతో ఆమోదం పొందింది. 65 దేశాలు గైర్హాజరయ్యాయి. గతంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా 140 దేశాలు నిలిచాయి.
రష్యా దురాక్రమణదారు అనే పదంతోపాటు 3 సవరణలతో.. అమెరికా గతంలో యుద్ధం ముగింపు కోసం పెట్టిన తీర్మానాన్ని యూరోప్(EUROPE) దేశాల మద్దతుతో ఫ్రాన్స్..ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టింది. యుద్ధానికి మూల కారణాన్ని కనుగొని పరిష్కారం చూడాలని రష్యా మరో సవరణను ప్రతిపాదించింది. దానికి అమెరికా తనంత తానుగా గైర్హాజరైంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు ట్రంప్, మెక్రాన్ శ్వేతసౌధంలో సమావేశమైన వేళ ఈ తీర్మానం ఐరాస సర్వ ప్రతినిధి సభలో చర్చకు వచ్చింది. అదీ 93-8 ఓట్లతో ఆమోదం పొందింది. 73 దేశాలు గైర్హాజరయ్యాయి.
అమెరికా తీర్మానానికి ఆమోదం
యుద్ధం ముగింపు కోసం శక్తిమంతమైన భద్రతా మండలి(uno)లో అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇది చట్టపరంగా కట్టుబడి ఉండాల్సినది. 5 దేశాలకు వీటో అధికారం ఉంటుంది. 10 మంది తాత్కాలిక సభ్యులుంటారు. అమెరికా తీర్మానం 10-0తో ఆమోదం పొందింది. యూరోప్ నకు చెందిన 5 దేశాలు గైర్హాజరయ్యాయి.
యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలనుకున్న అమెరికా.. రష్యాతో ప్రారంభించిన చర్చల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించిన తీర్మానాలు అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలకు సూచికలుగా నిలుస్తున్నాయి. రష్యాతో అంటకాగుతున్న అమెరికావల్ల ట్రాన్స్ అట్లాంటిక్ కూటమిలో ఉక్కపోతకూ ఇది సంకేతంగా నిలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాతో చర్చల్లో తమను భాగస్వాములను చేయలేదని యూరోపియన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి.






