‘రేసు’గుర్రాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఆరంభమైంది. విపక్ష రిపబ్లికన్ల తరపున అధ్యక్షపదవికి పోటీపడేదెవరో తేల్చే బృహత్తర కార్యక్రమానికి సమయం సమీపిస్తోంది.దాతల్ని మెప్పించి ఫండ్ రైజింగ్ చేసుకునే హాట్ డిబేట్ కు రిపబ్లికన్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ హాట్ డిబేట్ లో తమ పార్టీకే చెందిన ప్రత్యర్థుల్ని తమ వాదనా పటిమ, తమ దూరదృష్టి, దేశాభివృద్ధి ప్రణాళికలు .. తదితర అంశాలను వాదనలో ప్రజల ముందుంచనున్నారు. ఈ విశేష కార్యక్రమానికి ఫ్రంట్ రన్నర్ ట్రంప్ హాజరు కావడం లేదు. మిగిలిన నేతలు..విస్కాన్సిన్ రాష్ట్రంలో ఫాక్స్ న్యూస్ నిర్వహించే డిబేట్ లో తొలి ప్రయత్నం చేయనున్నారు.
ఈ డిబేట్ కు గానూ 12 మందిలో 9 మంది అర్హత సాధించారు. వీరిలో ట్రంప్ దూరంగా ఉండడంతో.. మిగిలిన ఎనిమిది మంది పోటీ పడనున్నారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హెలీ, సెనెటర్ టిమ్ స్కాట్, ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్స్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్, అర్కాన్సాస్ గవర్నర్ అసా హచిన్సన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి చర్చకు అర్హత సంపాదించారు. ఒకరిద్దరు ఈ జాబితాకు ఇంకా అదనంగా చేరితే చేరొచ్చు. వీరిలో నిక్కీ హెలీ, వివేక్ రామస్వామి భారత సంతతివారు. ఆశావహులంతా ఇప్పటికే దాదాపు 150 కోట్ల రూపాయలకుపైగా నిధులను సమీకరించారు.
ఫాక్స్ న్యూస్ నిర్వహించే ఈ చర్చలో రిపబ్లికన్ అభ్యర్థులు అనేక అంశాలపై తమ వాదనలను వినిపించబోతున్నారు. వీటిలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నుంచి, అమెరికాలో అబార్షన్ చట్టాల వివాదం దాకా పలు అంశాలు ఉండబోతున్నాయి. ప్రధాన అభ్యర్థి అనుకున్న వారిని దెబ్బతీయడానికి, అనామకుడు అనుకున్న వారిని రేసులో నిలబెట్టడానికి ఈ ప్రాథమిక స్థాయి చర్చ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్న వారిపై వీటి ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని తర్వాత కాలిఫోర్నియాలో మరో ప్రాథమిక సంవాదం ఉంటుంది.
ట్రంప్‌కు బలమైన పోటీదారుగా భావిస్తున్న రాన్ డిశాంటిస్‌కు ఈ సంవాదం అగ్ని పరీక్షగా భావిస్తున్నారు. ట్రంప్ కేసులపై కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో డిశాంటిస్ తన రేటింగ్‌ను పెంచుకోవడం తప్పనిసరి కానుంది. అయితే మరోవైపు… వివేక్ రామస్వామికి మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రామస్వామి మద్దతుదారులంతా.. ఆయనకే ఓటేస్తామంటున్నారు. కానీ డిశాంటిస్ మద్దతుదారుల్లో మూడోవంతే ఆయనకు ఓటేస్తామని గట్టిగా చెబుతున్నారు. ఈవాదనల ద్వారా తమస్థాయిని, ఆలోచనలను ప్రజలకు వివరించి గట్టి అభ్యర్థులుగా తమను తాము ప్రూవ్ చేసుకునే అవకాశం వీరందరికీ లభించనుంది. మరోవైపు.. అమెరికన్లు సైతం విపక్షంలో తమకు కావాల్సిన అభ్యర్థి గుణగణాలను బేరీజు వేసేందుకు అవకాశం లభిస్తుంది.






