China: చైనా ఆయుధ ప్రదర్శనకు సిందూర్ వేదికైందా…?
డ్రాగన్ కంట్రీ తెలివితేటలే.. తెలివితేటలు.. తన దగ్గర ఉన్న ఆయుధాలు గొప్పవని ఏదేశమైనా భావిస్తుంది. కానీ వాటిని యుద్ధక్షేత్రంలో వాడితేనే.. అసలు రంగు తేలుతుంది. అవి ఎంత గొప్పవో తనతో పాటు ప్రపంచానికి తెలిసివస్తుంది. ఆపై వాటికి వ్యాపార పరంగా విలువ పెరుగుతుంది. దీన్ని తనకు అనువుగా మార్చుకుంది చైనా (China). ఆపరేషన్ సిందూర్ యుద్ధక్షేత్రాన్ని .. తన ఆయుధాల పరిశీలనకు ఓ చక్కని వేదికగా మార్చేసింది.
భారత్, పాకిస్థాన్ మధ్య గత మే నెలలో జరిగిన సైనిక ఘర్షణను చైనా తనకు అనుకూలంగా వాడుకుందని అమెరికాకు చెందిన ఓ ద్వైపాక్షిక కమిషన్ సంచలన నివేదిక వెల్లడించింది. తన రక్షణ సామర్థ్యాలను వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించుకోవడానికి, ఆయుధాల అమ్మకాలను ప్రోత్సహించుకోవడానికి ఈ సంక్షోభాన్ని చైనా ఒక అవకాశంగా చూసిందని ఆరోపించింది.
అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం… ఈ ఘర్షణను చైనా తన ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంది. HQ-9 వాయు రక్షణ వ్యవస్థ, PL-15 గగనతల క్షిపణులు, J-10 యుద్ధ విమానాలు వంటి ఆధునిక ఆయుధాలను చైనా ఈ ఘర్షణలోనే తొలిసారిగా వాస్తవ పోరాటంలో పరీక్షించిందని నివేదిక పేర్కొంది. ఇది చైనాకు ఒక “రియల్-వరల్డ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్”గా ఉపయోగపడిందని తెలిపింది.
ఈ ఘర్షణ ముగిసిన తర్వాత, జూన్‌లో పాకిస్థాన్‌కు 40 J-35 ఐదో తరం యుద్ధ విమానాలు, KJ-500 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి చైనా ముందుకొచ్చినట్లు తెలిపింది. వివిధ దేశాల్లోని చైనా రాయబార కార్యాలయాలు కూడా భారత్-పాక్ ఘర్షణలో తమ ఆయుధాల ‘విజయం’ గురించి గొప్పగా ప్రచారం చేసుకుని, అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించింది.
ఇదే సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు చైనా ఓ తప్పుడు ప్రచార కార్యక్రమాన్ని కూడా నడిపిందని నివేదికలో పేర్కొన్నారు. తమ ఆయుధాలు ధ్వంసం చేసిన రఫేల్ జెట్ శకలాలంటూ ఏఐ, వీడియో గేమ్ చిత్రాలను నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేసిందని ఫ్రెంచ్ నిఘా వర్గాలు చెప్పినట్లు నివేదిక వివరించింది. ఈ ప్రచారంతో ఇండోనేషియాను సైతం రఫేల్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గేలా చైనా చేసిందని తెలిపింది.
అయితే, ఈ నివేదికలోని ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ కమిషన్ విడుదల చేసిన నివేదిక పూర్తిగా అవాస్తవమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ కమిషన్‌కు ఎప్పుడూ చైనా పట్ల సైద్ధాంతిక పక్షపాతం ఉందని, దానికి ఎలాంటి విశ్వసనీయత లేదని ఆమె అన్నారు.






