తైవాన్ చేతికి భారీగా అమెరికన్ డ్రోన్లు..
డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా మరోసారి షాకిచ్చింది. చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. మిత్రదేశం తైవాన్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే పనిలో పడింది. స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ముప్పుతిప్పలు పెట్టిన సాయుధ డ్రోన్లు తాజాగా తైవాన్ చేతికి అందనున్నాయి. తైవాన్‌కు భారీ సంఖ్యలో వీటిని విక్రయించాలని అమెరికా నిర్ణయించి, 36 కోట్ల డాలర్ల ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ఉక్రెయిన్‌లో విజయవంతంగా ప్రయోగించిన కొన్ని డ్రోన్లు దీనిలో భాగంగా తైవాన్‌కు చేరనున్నాయి. వీటి సంఖ్య 1,000 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ ఒప్పందం కింద అగ్రరాజ్యం 720 స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, అగ్నిమాపక వ్యవస్థలను తైవాన్‌కి అందించనుంది. వీటితోపాటు 291 ఆల్టియస్ 600ఎం ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయనుంది. తైవాన్‌పై సైనిక ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో వీటిని విక్రయించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈ చర్యలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఆసియా ఖండంలో ఆయుధ పోటీకి దారి తీస్తుందని ఆరోపించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని మండిపడింది.
ఇటీవలే చైనా సముద్రంలో .. డ్రాగన్ కంట్రీ నావీ విన్యాసాలు సైతం నిర్వహించింది. అంతేకాదు.. ఫిలిప్పీన్స్ షిప్ ను ఢీకొచ్చింది. ఆదేశానికి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. ఆత్మాహుతి డ్రోన్లు.. స్విచ్‌బ్లేడ్ 300, 600లను ఆత్మాహుతి డ్రోన్లుగా పేర్కొంటారు. వీటిని సైనికుడు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకొని కూడా ప్రయాణించవచ్చు. శత్రువుకు దూరంగా ఉంటూ కొండలు, సముద్రాలు, గగనతలాల నుంచి వీటిని ప్రయోగించవచ్చు. ప్రయోగించిన తర్వాతే వాటి రెక్కలు విచ్చుకొని డ్రోన్లా ఎగురుతాయి. అందుకే స్విచ్ బ్లేడ్ అని పేరుపెట్టారు. ఇది ఒక సైనిక వాహనాన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేస్తుంది. దీని ఆపరేటర్‌కు రియల్ టైమ్ వీడియో లింక్‌ను కూడా అందిస్తుంది.. యుద్ధక్షేత్రంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఆయుధ సరఫరా వల్ల ప్రాంతీయంగా సైనిక సమతౌల్యంపై ఎలాంటి ప్రభావం పడబోదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.






