Zelenskyy: ఉక్రెయిన్ కు అమెరికా హ్యాండిచ్చినట్లేనా.. జెలెన్ స్కీ మాటల వెనక అర్థమేంటి..?
ఉక్రెయిన్ పై రష్య దండయాత్ర దిగినప్పటి నుంచి కీవ్(Keiv) కు అమెరికా, యూరోప్ దేశాలు అండగా నిలిచాయి. భారీగా ఆయుధసాయం, ఆర్థిక సాయమందిస్తూ వచ్చాయి. వీటి సాయంతోనే ఉక్రెయిన్..అతిపెద్ద దేశమైన రష్యాతో ఫైట్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బైడన్ సర్కార్.. చివరివరకూ చేయగలిగింది చేసింది. కానీ ట్రంప్ రాకతో మొత్తం మారుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఇటీవల పుతిన్(putin) తో ట్రంప్ ఫోన్ సంభాషణకు సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన కామెంట్స్ చేశారు. తమ ప్రమేయం లేకుండా చర్చలు జరపడం సరికాదన్నారు. అంతేకాదు.. అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మనుగడ సాధించడం కష్టమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) పేర్కొన్నారు.
‘‘అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ మనుగడ చాలా చాలా కష్టం. అసాధ్యం కూడా. వారి మద్దతు లేకుంటే మేం జీవించే అవకాశాలు చాలా తక్కువ’’ అని ఎన్బీసీ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో మరింత సిద్ధం కావడం, సైనిక బలగాల శిక్షణ, రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయించుకోవడం కోసం పలు ఒప్పందాలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.
యూరప్ కు హెచ్చరిక..
మ్యూనిక్‌లో జరిగిన భద్రతా సదస్సులో మాట్లాడిన జెలెన్స్కీ.. యూరోపియన్ యూనియన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ప్రమాదం పొంచి ఉందని.. యూరోపియన్ దేశాలు.. ఇప్పటికైనా మేల్కొని, సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. గతంలోలా యూరప్ కు అమెరికా అండగా నిలవదన్న ఆయన.. త్వరలో ఈయూ(EU)పై దాడి చేసే ప్రమాదముందన్నారు. రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు.
యుద్ధం ముగింపునకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీలతో ఇటీవల వేర్వేరుగా మంతనాలు జరిపారు. పుతిన్‌తో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపినట్లు స్వయంగా ట్రంప్ వెల్లడించారు. నాటోలో ఉక్రెయిన్ చేరిక ఆచరణాత్మకంగా సాధ్యం కాదని భావిస్తున్నానని చెప్పిన ట్రంప్.. గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉక్రెయిన్‌కు లేదన్నారు.






