Keiv: ఆపదలో ఉన్నాం.. బిజినెస్ అంటే ఎలా..? ట్రంప్ పై జెలెన్ స్కీ అసంతృప్తి..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచాయి. అగ్రరాజ్యమైన రష్యాను… చిన్న ముక్క ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. ఇరువైపులా లక్షల మంది సైనికులు ప్రాణాలుకోల్పోయారు. మొన్నటివరకూ బైడన్ సర్కార్.. కీవ్ కు పూర్తిగా మద్దతుగా నిలిచింది. బిలియన్ల కొద్దీ నిధులు సాయంగా అందించింది. సర్కార్ మారింది… దాని ప్రాధాన్యతలు మారాయి. ఇప్పుడు వచ్చిన ట్రంప్(Trump).. అంతా బిజినెస్ గా చూస్తున్నారు. ఇప్పటివరకూ తాము చేసిన సాయానికి బదులుగా .. ఉక్రెయిన్ దగ్గర ఉన్న విలువైన ఖనిజాలు తమకు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు జెలెన్ స్కీ.
రష్యా(Russia)పై యుద్ధం చేసేందుకు తమకు అమెరికా అందించిన సాయం 100 బిలియన్ డాలర్లే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటి వరకు 320 బిలియన్ డాలర్లు ఖర్చుకాగా.. ఇందులో 120 బిలియన్ల డాలర్లను ప్రజల నుంచి సేకరించామని.. మరో 200 బిలియన్ డాలర్లను ఐరోపా సమాఖ్య, అమెరికా అందించాయని జెలెన్స్కీ కీవ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘‘మొత్తంగా అమెరికా నుంచి 67 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలు.. 31.5 బిలియన్ డాలర్ల బడ్జెట్ సపోర్ట్ మాత్రమే అందాయి. ఎవరైనా సరే దానిని 500 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి అంతమొత్తం ఖనిజ సంపద ఇవ్వమని అడగకూడదు’’ కీవ్ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
ఉక్రెయిన్(Ukraine)కు యుద్ధంలో మద్దతు కొనసాగాలంటే బదులుగా 500 బిలియన్ డాలర్లు విలువైన ఖనిజాలను తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు ట్రంప్. ఈ డీల్‌కు కీవ్ కూడా సానుకూలంగా ఉందని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు కీవ్‌కు అందించిన సాయాన్ని రకరకాలుగా చేప్పారు. ఓ సందర్భంగా ఏకంగా 350 బిలియన్ డాలర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
2022 ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరుతో రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాటో విస్తరణను నిలువరించే ప్రయత్నం, డాన్బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలుగా పుతిన్(putin) ప్రకటించారు. మొదట్లో మాస్కో సేనలు దూకుడు కనబర్చినా.. అనంతరం పాశ్చాత్య దేశాల ఆయుధ సాయంతో కీవ్ సైతం దీటుగా స్పందించింది. మూడేళ్లలో ఇరువైపులా లక్షలాదిమంది సైనికులు మరణించగా…. కోట్ల డాలర్ల మేర ఆస్తినష్టం వాటిల్లింది.






