US: రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం టారిఫ్.. భారత్, చైనాకు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగడం లేదు. ఎన్ని ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా దారికి రావడం లేదు. దీంతో రష్యా ఆర్థికమూలం చమురు కొనుగోళ్లపై టారిఫ్ వార్ ప్రారంభించారు. అయితే అది కూడా సరిగా పనిచేయలేదు. దీంతో ఇక ఆయన అమ్ములపొదిలో కీలక అస్త్రం బయటకు తీశారు. ఇందులోభాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు (Trump Traiffs) విధిస్తానని హెచ్చరించారు..
ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల ప్రతిపాదించారు.
రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేలా రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే మాస్కోతో వ్యాపారం చేస్తున్న దేశాలపై టారిఫ్‌ల తగ్గింపునకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.






