Washington: ద్విధృవ కూటమికి తెర.. రష్యాతో అమెరికా చెట్టపట్టాల్..?
అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పరిణామాల్ని చకచకా మార్చేస్తున్నారు. కోల్డ్ వార్ సమయం నుంచి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రష్యన్లను.. ఇప్పుడు మిత్రులుగా చేసుకునే పనిలో ట్రంప్ టీమ్ బిజీగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ నివారణకుప్రయత్నిస్తూనే.. స్వామికార్యం, స్వకార్యం రెండు నెరవేరేలా ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అసలు పుతిన్ మనసులో ఏముంది.. అన్నది తెలుసుకునే చర్యల్లో భాగంగా.. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఉక్రెయిన్ కు మిలటరీసాయం నిలిపివేశారు ట్రంప్. నిర్ద్వంధ్వంగా యుద్ధాన్ని ముగించాలని ఉక్రెయిన్ కు సూచిస్తున్నారు. అంతేకాదు.. యుద్ధంలో కోల్పోయిన భూమి తిరిగి రాదని గట్టిగానే చెబుతున్నారు. ఈపరిణామాలను చూస్తున్న అందరికీ.. అగ్రదేశాలు రెండూ చెట్టపట్టాల్ వేసుకుని తిరిగే రోజులు త్వరలోనే రాబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ముందు నుంచీ పుతిన్‌కు మద్దతుగా ఉంటూ వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). యుద్ధం ముగింపుతో పాటు మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా (Russia)పై అమెరికా గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహరాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్‌హౌస్ కోరినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రష్యన్ ఒలిగార్క్‌ల(oligarch)పైనా ఆంక్షలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఆంక్షల ఉపశమనానికి ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏమి కోరుతుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
చమురు ధరలు దిగొచ్చేనా..?
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత మాస్కోపై అగ్రరాజ్యం సహా అనేక పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి.మాస్కోకు చెందిన సంస్థలు, వ్యక్తులపైనా నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యాపై ఆంక్షలు విధించడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, ట్రంప్ అధికారంలోకి రాగానే ఇరాన్ చమురు ఎగుమతులపై దృష్టిపెట్టారు. దీంతో రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత భగ్గుమంటాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు రష్యాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే.. చమురు ధరలకు అడ్డుకట్టే పడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.






