Whitehouse: హార్వర్డ్ ఓ వినాశకారి.. విశ్వవిద్యాలయంపై ట్రంప్ కామెంట్స్…

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి, ట్రంప్ (Trump) సర్కారుకు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థుల పేర్లు, వారి వివరాలు తమకు అందజేయాలని అధ్యక్షుడు డిమాండు చేస్తున్నారు. లేదంటే గ్రాంట్లను, రుణాలను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి స్పందించిన ట్రంప్.. యూనివర్సిటీపై మండిపడ్డారు. అమెరికాకు హార్వర్డ్ ఓ వినాశకారిగా మారుతోందని దుయ్యబట్టారు. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు సమస్యల సృష్టికర్తలని విమర్శించారు.
‘హార్వర్డ్ మన దేశాన్ని తీవ్రంగా అవమానిస్తోంది. 5 బిలియన్ డాలర్లకు పైగా నిధులు తీసుకుంటున్న ఆ విద్యా సంస్థలో జాతి వ్యతిరేక ధోరణి పెరుగుతోంది. దేశంలో మరికొన్ని కళాశాలలూ ఇలాగే తయారవుతున్నాయి. దాన్ని బయటపెడితే పోరాటం చేస్తామంటున్నారు. వారు పోరాడిన ప్రతిసారీ 250 మిలియన్ డాలర్ల చొప్పున కోల్పోక తప్పదు’ అని ట్రంప్ హెచ్చరించారు.
‘హార్వర్డ్‌లో దాదాపు 31శాతం మంది విదేశీ విద్యార్థులున్నారు. వారి లెక్క చెప్పమంటే యూనివర్సిటీ స్పందించట్లేదు. ఆ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు.. వారు సమస్యాత్మకమా.. అనేది మేం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల నుంచీ ఈ వర్సిటీకి విద్యార్థులు వస్తున్నారు. వారు మన దేశంలో సమస్యలు సృష్టిస్తామంటే మేం చూస్తూ ఊరుకోం. అలాంటి దేశాలు మనకు ఆర్థికంగా ఏ మాత్రం సాయం చేయవు. హార్వర్డ్‌లో పెట్టుబడులు పెట్టవు. మరి అలాంటప్పుడు 31శాతం మంది విదేశీ విద్యార్థులు ఎందుకు? ఈ పరిమితిని 15శాతానికి తగ్గించాలని భావిస్తున్నా’ అని ట్రంప్ స్పష్టం చేశారు.