Washington: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. పుతిన్ తో మాట్లాడానన్న ట్రంప్..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివస్తున్నట్లు కనిపిస్తున్నాయి. బైడన్ హయాంలో అసలు చర్చల ప్రస్తావనే లేని పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో.. అప్పటి నుంచి రష్యాIRussia)-ఉక్రెయిన్ దేశాల మధ్య సంధికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అధికారికంగా పుతిన్ తో మాట్లాడతానంటూనే.. శాంతి చర్చలకు రాకుంటే ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. అయితే బెదిరింపులతో పని జరగదన్న క్రెమ్లిన్.. చర్చలకు పుతిన్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేసింది.
లేటెస్టుగా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారానికి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో ఇద్దరం కలిసి పని చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. తాము ఫోన్లో మాట్లాడుకున్నామని తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా బుధవారం ట్రంప్ తెలిపారు. రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచరు మార్క్ ఫోగెల్ విడుదల అనంతరం తాను పుతిన్‌తో మాట్లాడినట్లు వివరించారు. మరోవైపు ఫోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరగాడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. ఫోగెల్కు రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ వారం జర్మనీలో జరిగే మ్యూనిక్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించబోతున్నారు. మ్యూనిక్ సదస్సు తరువాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోనూ ట్రంప్ బుధవారం మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను, చర్చల అంశాన్ని ఆయనతో ప్రస్తావించారు.
మూడు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం కాస్తా రెండేళ్లయినా ఓకొలిక్కి చేరలేదు. పశ్చిమాసియా , అమెరికా మద్దతుతో రెండేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ వస్తోంది. దీంతో రష్యా గెలవలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులకు తోడు రష్యన్లు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో దేశంలో కూడా పుతిన్ పై కాస్త ఒత్తిడి ఉంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ తో సంధి మంచిదన్నది పుతిన్ అభిప్రాయంగా ఉంది. అయితే.. అది తన షరతులకు లోబడి ఉండాలన్న ఆలోచన కూడా పుతిన్ లోఉంది. అందుకే ట్రంప్ తెచ్చిన శాంతి ప్రక్రియకు సై అన్నారు పుతిన్..
మరోవైపు.. ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది. ఆ దేశం తిరిగికోలుకోవాలంటే.. అన్నీ అనుకున్నట్లుగా జరిగి, అమెరికా సహా మిత్రదేశాలు ఆదుకుంటే.. తిరిగి ప్రస్తుత స్థితికి చేరడానికి 50 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా కొన్నాళ్లు యుద్ధం చేసే స్దితిలో లేదు జెలెన్ స్కీ(zelensky) ..దీంతో ఆయన కూడా యుద్ధం కాస్త ఆగితే చాలనుకుంటున్నారు.






