Washington D.C: క్యాపిటల్ పై దాడి నిందితులకు క్షమాభిక్ష .. మాట నిలబెట్టుకున్న ట్రంప్..

అమెరికా 47వ అధ్యక్షుడు ట్రంప్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూఎస్ క్యాపిటల్(capitol hill)పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. 2021 జనవరి 6 నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తన మద్దతుదారులకు (Capitol riot defendants) క్షమాభిక్ష ప్రసాదిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఆ ఘటన ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్‌షీట్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది. గతంలో ఏ అధ్యక్షుడు తీసుకోని రీతిలో ట్రంప్ అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలిరోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పాస్ చేశారు. అంతేకాదు.. తనవారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నట్లుగానే.. వారందరినీ విడుదల చేశారు. ఈపరిణామం సహజంగానే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.