White House: భారత్ ఉగ్రపోరులో ఘన విజయం.. ఇక భారత్ కు ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్
ముంబైలో భీకర ఉగ్రవాద దాడుల తర్వాత భారత్.. ఉగ్రవాదంపై పోరు ప్రకటించింది. ఇప్పటికీ ఉగ్రవాద దండాలపై దాడులు చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ తో వారికి వణుకు తెప్పిస్తోంది. ఈక్రమంలో విదేశాల్లో ఉగ్రవాదులు మరణాలవెనక కూడా భారత్ హస్తమున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాదు.. దేశంలో దాడులుచేసి విదేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను.. తిరిగి వెనక్కు రప్పించి, న్యాయస్థానాల ముందు నిలబెట్టేలా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈప్రయత్నంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించింది.
అమెరికా పర్యటనలో భాగంగా మోడీ.. ముంబైదాడుల నిందితుడు తహవూహ్ రాణా(tahavur rana)ను భారత్ రప్పించేందుకు మార్గం సుగమం చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూను ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు. దీనికి ముందు భారత్ నుంచి వెళ్లే సమయంలో మోడీ అండ్ టీమ్… అమెరికాలో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల చిట్టాను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. దీన్ని ట్రంప్ కార్యవర్గానికి అందించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ సంయుక్త ప్రకటన వెలువడింది.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ.. 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.
26/11 దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ(headly) ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు.






