Washington: ట్రంప్ , చైనా టారిఫ్ వార్.. ప్రపంచంపై మాంద్యం ఛాయలు
ట్రంప్ తగ్గేదే లేదంటాడు.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ టారిఫ్ వార్ కు తెరతీసిన ట్రంప్(Trump).. ఈ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదంటున్నాడు. పక్కనే ఉన్న మెక్సికో, కెనడా నుంచి మిత్రదేశం భారత్ వరకూ అందరికీ వడ్జింపులు చేశాడు. అంతటితో ఆగలేదు.. వ్యాపారంలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న చైనా(china)కు గట్టి షాకే ఇచ్చాడు. గతంలో పదిశాతం టారిఫ్ నుంచి 20 శాతానికి పెంచేశాడు. దీంతో చైనా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో ఆదేశం కూడా అదేస్థాయిలో అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చింది.
యూఎస్ నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై 10 నుంచి 15 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. సోయాబీన్, పోర్క్, ఇతర ఉత్పత్తులపై 10 శాతం, చికెన్, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది. మార్చి 10 నుంచి అవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది (China-USA). ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమరవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం (Tariffs on China) తీసుకున్నామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అందుకే టారిఫ్లను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.దీంతో ట్రంప్ నిర్ణయం వాణిజ్య పోరును తీవ్రం చేసిందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దీనివల్ల మరోసారి మాంద్యం ఛాయలు కమ్ముకునే ప్రమాదాలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు.
కెనడా (Canada), మెక్సికో దిగుమతులపై 25శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ వెల్లడించారు. మార్చి 4 నుంచి అవి యథావిధిగా అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. దీనికి ప్రతిగా ట్రూడో కూడా అగ్రరాజ్యంపై సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇవి కూడా మంగళవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్ల పైనా పడింది.






