విజయ్ తమిళ రాజకీయ పద్మ వ్యూహంలో అభిమన్యుడా.. లేక అర్జునుడా..

తమిళనాట రాజకీయాలలో మరొక కొత్త పార్టీ తన ప్రస్థానం మొదలుపెట్టింది. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయిలో పొలిటికల్ రంగంలోకి దిగారు. తమిళ రాజకీయాలకి.. సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. తమిళనాట అమ్మగా గుర్తింపు పొంది ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు మకుటం లేని మహారాణిలా మెలిగిన జయలలిత సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. ఎంజీఆర్, విజయ్ కాంత్.. ఇలా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ రాజకీయాలలో తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎంతోమంది ఉన్నారు.
ప్రస్తుతం అధికారంలో డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి కూడా సినీ రచయిత అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన మనవడు.. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి తమిళ సినిమాలలో హీరోగా చేసి ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. ఇక కమల్ హాసన్, రజనీకాంత్, శరత్ కుమార్ లాంటి హీరో లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరోపక్క విజయ్ కాంత్.. 20 ఏళ్ల కిందటనే ఎండీఎంకే పార్టీని స్థాపించి విజయం లేకపోయినా తన వంతు పోరాటం చేస్తూ వచ్చారు.. గత ఏడాది ఆయన చనిపోవడంతో పార్టీ బాధ్యతను ప్రస్తుతం ఆయన భార్య నిర్వహిస్తున్నారు.
ఇక ఇప్పుడు విజయ్ తన పార్టీతో తమిళ రాజకీయాలలో సరికొత్త అధ్యయనం మొదలు పెడతాడు అన్న ఆశ అతని అభిమానులలో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను సవాల్ చేసే విధంగా విజయ్ పార్టీ ఎదుగుతుందా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. తమిళనాట విజయ్ కి అభిమానుల అండా దండా పుష్కలంగా ఉంది. హీరోగా బాగా పాపులర్ అయిన విజయ్ వచ్చే ఎన్నికలలోపు రాజకీయంగా తనని తాను ఎంతో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.