అమెరికా ఆధిపత్యానికి రష్యా సవాల్…?
ప్రపంచానికి మరో సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే నాటో కూటమి పేరుతో అగ్రరాజ్యం అమెరికా చాలా పటిష్టవంతంగా తయారైంది. తనతో పాటు యూరప్ లోని దేశాలను కలుపుకుని.. ఓ బలీయమైన కూటమిగా ఆవిర్భవించింది. దీంతో రష్యాను నేరుగానే సవాల్ చేస్తోంది. ఉదాహరణకు గతంలో ఆఫ్గన్ పోరాటం, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం… ఈ రెండింటిలోనూ రష్యాకు అమెరికాతో తలనొప్పులు తప్పడం లేదు. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తుంటే.. మరోవైపు అమెరికా, యూరప్ దేశాలు ఆ దేశానికి ఆయుధాలు అందిస్తున్నాయి. ఫలితంగా రెండున్నరేళ్లయినా చిన్నదేశం ఉక్రెయిన్ ను రష్యా వశపరచుకోలేకపోయింది.
దీనికి తోడు రష్యాను ఆంక్షల వలయంలో బంధించింది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మిత్రదేశాలు.. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో చాలా రంగాల్లో రష్యా ముందుకెళ్లలేని పరిస్థితి ఉంది. భారత్ లాంటి సంప్రదాయ, పురాతన మిత్రదేశాలు … అటు అమెరికాతోనూ కలిసి సాగుతున్నాయి. దీంతో తనకు అవసరమైనప్పుడు, అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీ అందించే మిత్రదేశాల వైపు రష్యా చూస్తోంది. దీనిలో భాగంగానే చైనా, ఉత్తరకొరియాలను చూస్తోంది రష్యా. మొన్నటికి మొన్న చైనాలో పర్యటించిన పుతిన్.. ఇప్పుడు కిమ్ ఆహ్వానం మేరకు ఉత్తరకొరియాను సందర్శించారు.
రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. వీటితోపాటు ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహాకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా పరిణామాలు అమెరికా, యూరప్ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. ఓవేళ ఇప్పుడు ఉత్తరకొరియా, రష్యాపై ఎలాంటి దాడులు జరిగినా కచ్చితంగా అది అణుబాంబు వినియోగానికి దారితీసే ప్రమాదముంది.రష్యాను అంతర్జాతీయంగా కాస్తైనా ప్రభావితం చేయొచ్చు కానీ.. ఉత్తరకొరియా మాత్రం అలా కాదు. తన ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఈ పరిస్థితుల్లో నాటో కూటమి దేశాలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






