Davos: దావోస్ లో తెలంగాణ రైజింగ్…. రేవంత్ టూర్ గ్రాండ్ సక్సెస్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. దావోస్‌లో వివిధ సంస్థలతో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తాజా ఒప్పందాలతో సరికొత్త రికార్డు సృష్టించగా.. దాదాపుగా 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీగా పెట్టుబడులు సమీకరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు సాగగా.. గతంతో పోలిస్తే ఈసారి మూడింతలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్ సమీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్(TELANGANA raising) బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ(feature city) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం .. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది.
ప్రముఖ సంస్థల పెట్టుబడులు..
అమెజాన్ వెబ్ సర్వీసెస్ – రూ.60 వేల కోట్లు
మేఘా ఇంజినీరింగ్ సంస్థ – రూ.15 వేల కోట్లు
హెచ్‌సీఎల్ సంస్థ – రూ.10 వేల కోట్లు
జేఎస్‌డబ్ల్యూ – రూ.800 కోట్లు, విప్రో – రూ.750 కోట్లు
రూ.500 కోట్లతో స్కైరూట్ ఏరో స్పేస్ తయారీ, పరీక్షా కేంద్రం
టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందం
రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ ఉర్స్ క్లస్టర్స్ ఒప్పందం
రూ.7 వేల కోట్ల పెట్టుబడికి మైత్రా గ్రూప్ ఎంవోయూ
అక్షత్ గ్రీన్ టెక్ – రూ.7 వేల కోట్లు
బ్లాక్ స్టోన్ – రూ.4,500 కోట్లు పెట్టుబడులు
వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ సంస్థలు తమ ప్రాంగణాలను పెద్దఎత్తున విస్తరించనున్నట్లు ప్రకటించాయి. ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ నూతన ప్రాంగణాన్ని నెలకొల్పనుండగా.. సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఆయా సంస్థల ద్వారా రాష్ట్రంలో 25,800 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్(Clean and grean) పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది.