Rahul Gandhi: రాహుల్ గాంధీకి క్లారిటీ మిస్ అయిందా..?
భారత ఎన్నికల సంఘం (EC)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీకి (BJP) మేలు చేసేందుకే ఈసీ (EC) ఈ పని చేస్తోందని, ఇలాంటి వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే బీహార్లో (Bihar) ఇలాంటి దొంగ ఓట్లను ఈసీ తొలగించినప్పుడు, రాహుల్ గాంధీ దాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఇది ఆయనలోని పరస్పర వైరుధ్య వైఖరిని తెలియజేస్తోంది.
రాహుల్ గాంధీ ఈసీపై అనేక ఆరోపణలు చేశారు. ఐదు రకాల అవకతవకలకు ఈసీ పాల్పడుతోందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చెప్పారు. డూప్లికేట్ ఓట్లు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలో వందల ఓటర్ల నమోదు, చెల్లని ఫొటోలు, ఫారం-6 దుర్వినియోగం లాంటివి రాహుల్ చేసిన ప్రధాన ఆరోపణలు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 80 మంది ఓటర్లు నమోదైన సందర్భాలు ఉన్నాయని ఆయన ఉదాహరణగా చెప్పారు. మహారాష్ట్రలో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని, ఇది అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలకు ఈసీ, అధికార బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.
తాజాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను చేపట్టింది. ఈ ప్రక్రియ లక్ష్యం ఓటరు జాబితాను శుద్ధి చేయడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం, మరణించిన లేదా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను అప్డేట్ చేయడం. ఈ ప్రక్రియలో 65.2 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో 22.34 లక్షల మంది మరణించిన ఓటర్లున్నారు. 36.28 లక్షల మంది వలస వెళ్లినవారు లేదా చిరునామా దొరకనివారు ఉన్నారు. ఇక 7.01 లక్షలు డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ ముసాయిదా జాబితా ఆగస్టు 1న విడుదలైంది. సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. తుది జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురితమవుతుంది.
దీంతో బీహార్ లో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ పని చేస్తోందని అర్థమవుతోంది. అయితే రాహుల్ గాంధీ ఈ ప్రక్రియను కూడా తప్పుబడుతున్నరు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోందని చెబుతున్నారు. ఈసీకి పారదర్శకత లేదని, ఓటర్ల నుంచి సంతకాలు లేదా రసీదులు తీసుకోకుండా పేర్లను తొలగిస్తోందని, ప్రతిపక్ష ఓటర్లను లక్ష్యంగా చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. డిజిటల్ ఓటరు జాబితాలను తనిఖీకి అందుబాటులో ఉంచడానికి ఈసీ నిరాకరించడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమైనవని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈసీ విశ్వసనీయతను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షం రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని వారి అభిప్రాయం. అయితే, ఓటరు జాబితా శుద్ధీకరణలో పారదర్శకత లోపం, ఓటర్లకు తగిన సమాచారం అందించకపోవడం వంటి అంశాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. తొలగించిన ఓటర్లలో ఎక్కువమంది ప్రతిపక్ష బలమైన ప్రాంతాల నుంచి ఉన్నారని కాంగ్రెస్ వాదిస్తోంది, అయితే ఈసీ దీనిని తిరస్కరిస్తోంది.
రాహుల్ గాంధీ ఆరోపణలు ఎన్నికల సంఘం విశ్వసనీయతపై సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని ఒకవైపు చెబుతూనే, ఆ ప్రక్రియను రాజకీయ కుట్రగా చిత్రీకరించడం వైరుధ్యంగా కనిపిస్తోంది. ఈసీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఆధారాలు సమర్పించాలని కోరుతోంది.






