పుతిన్ ఇచ్చింది ఆఫరా..? వ్యూహమా..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. ఓవైపు రష్యా ఆయుధపాటవానికి ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నా.. ఆదేశం గుండె ధైర్యం మాత్రం సడలడం లేదు. పాశ్చాత్య ప్రపంచం ఇస్తున్న ఆయుధ సాయంతో.. ప్రాణాలను ఒడ్డి మరీ యుద్ధం చేస్తోందీ బుల్లిదేశం. ఈ యుద్థంలో తాము ఎంతగా నష్టపోతున్నా.. అగ్రదేశమైన రష్యాకు కూడా అదేస్థాయిలో నష్టాన్ని కలిగిస్తోంది. దీంతో ఈ యుద్ధం వేగంగా ముగియాలని ప్రపంచం కోరుకుంటోంది. ఈ దశలో ఇటలీలో జరుగుతున్న జి-7 దేశాల సదస్సులోనూ ఈ యుద్ధంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ప్రపంచదేశాధినేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచదేశాలు కోరుకుంటున్నట్లుగా కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు విధించారు. రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్ మాట్లాడుతూ మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం అని అన్నారు. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు. జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి పూర్తి అవగాహన ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం దీనికి అంగీకరించేలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లోనూ కీవ్ సేనలు ఫైట్ చేస్తున్నాయి. దీంతో రష్యాకు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పుతిన్ మాటలు నమ్మి వెనుకంజ వేస్తే.. ఆపై మాస్కో తిరిగి దాడులు చేస్తే.. ఈసారి కీవ్ కు ఓటమి తప్పదని జెలెన్ స్కీకి తెలుసు. అంతేకాదు.. ప్రస్తుతం అన్నీ వదులుకుని తుదిపోరాటం చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించే పరిస్థితి ఉండదని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి.
ఈ జీ7 సదస్సులో ఈ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపాయి. మరోవైపు..ఈ యుద్ధం మొదలు కావడంతో రష్యాపై ఆంక్షల్ని మరింత బిగించాయి పాశ్చాత్య దేశాలు. దీంతో రష్యా ఆంక్షలతో ఇబ్బందులు పడుతోంది. ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఏదో చమురు అమ్ముకుంటూ ముందుకెళ్తోంది రష్యా. ప్రజల్లో కూడా ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నియంతృత్వ పాలన ఉండడంతో ప్రజలు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. కానీ ఎన్నాళ్లిలా.. ఈయుద్ధం అంతిమ ఫలితం సంగతి ఏమో కానీ..రష్యాకు మాత్రం గట్టి దెబ్బగానే పరిగణించొచ్చు.






