Pelican: ప్రాజెక్టు పెలికాన్.. కెనడాలో ఖలిస్తానీ డ్రగ్స్ దందా..

Canada: కెనడా నుంచి పెద్దఎత్తున భారత వ్యతిరేకతను పెంచిపోషిస్తున్న ఖలిస్తానీ సానుభూతి పరులకు నిధులెక్కడ నుంచి వస్తున్నాయి. వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు.. ? ఉగ్రవాద నెట్ వర్క్ లకు అంతంత డబ్బు ఎలా అందించగలుగుతున్నారు. వీటన్నింటికి సంబంధించిన ఓ కీలక విషయం వెలుగు చూసింది. అదే ఆపరేషన్ పెలికాన్ (Pelican).. కెనడా, అమెరికా అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఓ ఆపరేషన్ .. ఈ దందాను వెలికితీసింది.
భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోసేలా ఖలిస్థానీ సానుభూతిపరులు నిధుల సమీకరణకు కెనడాలో భారీ ఎత్తున డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు. అక్కడి పీల్ రీజనల్ పోలీసులు ప్రాజెక్టు పెలికాన్ పేరిట నిర్వహించిన దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్ సందర్భంగా 479 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ 47.9 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ మూలాలున్న ఏడుగురు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
అమెరికా-కెనడా మధ్య ఉన్న వాణిజ్య ట్రక్కుల రవాణా మార్గాన్ని వీరు వాడుకొంటున్నట్లు గుర్తించారు. వీరికి మెక్సికన్ ముఠాలతో సన్నిహిత సంబంధాలున్నాయని పీల్ పోలీసులు వెల్లడించారు. ఈ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం నుంచి వచ్చే సొమ్మును భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో ఆందోళనలు, రెఫరండాల నిర్వహణ, ఆయుధాల కొనుగోళ్లు వంటి వాటికి పాల్పడుతున్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతోనే ఈ ఖలిస్థానీ ముఠాలు మెక్సికన్ నుంచి వచ్చే విలువైన కొకైన్ ఎగుమతి చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అఫ్గానిస్థాన్ నుంచి వచ్చే హెరాయిన్ నుంచే ఐఎస్‌ఐ కార్యకలాపాలకు నిధులు సేకరిస్తోంది.
తాజాగా అరెస్టైన వారిలో యోగేంద్రరాజ(టొరంటో), మన్‌ప్రీత్ సింగ్(బ్రాంప్టన్), ఫిలిప్ టెప్ (హామిల్టన్), అరవింద్ పవార్ (బ్రాంప్టన్), కమర్‌జిత్ సింగ్ (కాలెడాన్) గుర్జీత్ సింగ్ (కాలెడాన్), సత్రజ్ సింగ్ (కేంబ్రిడ్జ్), శివ్ ఓంకార్ సింగ్ (జార్జిటౌన్), హవో టామీ హుయన ఉన్నారు.
గతేడాది నుంచే నిఘా..
గతేడాది డిసెంబర్‌లో అమెరికాలోని ఇల్లినాయిస్‌లో భారతీయ మూలాలున్న ఇద్దరు కెనడా వాసులను అరెస్టు చేశారు. వీరి వద్ద 1,000 పౌండ్ల కొకైన్ బయటపడింది. దీనిని వారు వోల్వో ట్రక్కులో లోడ్ చేసి తరలిస్తుండగా స్వాధీనం చేసుకొన్నారు. ఇక తాజాగా దాడికి సంబంధించిన దర్యాప్తు 2024 జూన్‌లోనే మొదలైంది. అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ట్రక్కులు ప్రయాణించే మార్గాలపై నిఘా ఉంచారు. నవంబర్ నాటికి చాలామంది వ్యక్తులు, ట్రెక్కింగ్ కంపెనీ, డ్రగ్స్‌ను దాచే ప్రదేశాలను గుర్తించారు. ఇందుకో కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ, అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ సాయం తీసుకొన్నారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి-మే మధ్యలో 127 కేజీల కొకైన్‌ను విండ్‌సర్‌లోని అంబాసిడర్ వంతెన వద్ద, 50 కేజీల కొకైన్‌ను పాయింట్ ఎడ్వర్డ్‌లోని బ్లూవాటర్ వంతెన సమీపంలో పీల్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇక గ్రేటర్ టొరంటో వద్ద కూడా కొంత పట్టుకొన్నారు.