బ్రూనై, సింగపూర్ దేశాల్లో భారత ప్రధాని మోడీ పర్యటన
భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పసిఫిక్ విజన్ లో బ్రూనై భారత్ కు ముఖ్య భాగస్వామిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ… బ్రూనైలో పర్యటించారు. విమానాశ్రయంలో మోడీకి.. క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ఘనస్వాగతం పలికారు. బ్రూనే దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. సుల్తాన్ అధికారిక నివాసం ఇస్తానా నురుల్ ఇమాన్ కు చేరుకున్న ప్రధాని మోడీకి.. సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా, ఆయన కుటుంబసభ్యులు సాదరస్వాగతం పలికారు.
బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో మోడీ సమావేశమయ్యారు.రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమవుతుందన్నారు భారత ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరినట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధులు ప్రకటించారు. ముఖ్యంగా బ్రూనై నుంచి నేరుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
దీనికి కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నామన్నారు.బ్రూనైలో భారత నూతన హైకమిషనర్ కార్యాలయాన్ని మోడీ ప్రారంభించారు. అలాగే.. బ్రూనైలోని భారతీయులతో ముచ్చటించారు. తర్వాత రెండు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్నారు ప్రధాని మోడీ. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు ఆరేళ్ల అనంతరం మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. సింగపూర్ దేశాక్షుడు టి.షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలు, వ్యాపారవేత్తలతో మోడీ భేటీ అవుతారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ విజన్లో భాగంగా ఈ రెండు దేశాల్లో మోడీ పర్యటనను భారత్ కీలకంగా భావిస్తోంది.






