Majeed Brigade: పాక్, చైనా వెన్నులో దడ పుట్టిస్తున్న మాజిద్ బ్రిగేడ్..
పాకిస్తాన్ లో ఏకంగా ఓట్రైన్ నే హైజాక్ చేసిన మాజిద్ బ్రిగేడ్(Majeed Brigade).. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాక్ సైన్యాన్ని ఢీకొట్టేస్థాయిలో వ్యూహాలు పన్నుతూ.. అబేధ్యంగా మారింది బ్రిగేడ్. అంతేకాదు.. బలోచ్ ఉద్యమకారులను మట్టుబెట్టే కిరాయి ముఠాలను కూడా ఈ దళమే వేటాడుతోంది. ఇక తమ భూభాగంలో చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను వ్యతిరేకిస్తూ భారీ దాడులు నిర్వహించింది.
మాజిద్ బ్రిగేడ్ ప్రస్థానం..
పాక్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో బలోచ్ ఉద్యమాన్ని అణచివేసేందుకు భారీ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో 1974 ఆగస్టు 2న మాజిద్ లాంగోవ్ సీనియర్ అలియాస్ అబ్దుల్ మాజీద్ బలోచ్ అనే మిలిటెంట్ భుట్టోపై హత్యాయత్నం చేశాడు. క్వెట్టాలో ప్రధాని కార్యక్రమానికి సమీపంలో ఓ చెట్టుపై గ్రనేడ్‌తో కూర్చొన్నాడు. కానీ, పొరపాటున అది చేతిలోనే పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి తమ్ముడు జూనియర్ మాజిద్ ఈ పోరాటం బాధ్యతలు తీసుకొన్నాడు. 2010లో పాక్ సైన్యం క్వెట్టాలో ఓ ఇంటిపై దాడి చేసింది. అక్కడ జూనియర్‌తోపాటు పలువురు బలోచ్ మిలిటెంట్లు ఉన్నారు. దీంతో సైన్యాన్ని ఆపే పని మాజిద్ జూనియర్ తీసుకొన్నాడు. ఈ లోపు అతడి మిత్రులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఓ గంట పాటు పోరాడిన జూనియర్ చివరికి సైన్యం చేతిలో మరణించాడు. దీంతో మాజిద్ సోదరులు బలోచ్ ఉద్యమంలో బాగా పాపులర్ అయ్యారు. వీరి స్ఫూర్తితో అస్లాం ఆచు అనే మిలిటెంట్ 2011లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ కోసం ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశాడు. దానికి మాజిద్ బ్రిగేడ్ అని పేరుపెట్టాడు.
చైనా ప్రాజెక్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ..
బలోచ్ లిబరేషన్ ఆర్మీని అంతం చేసేందుకు పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కిరాయి ముఠాలను కూడా వాడుతోంది. వాటిల్లో షఫీక్ మెంగల్ గ్రూప్ ఒకటి. మాజిద్ బ్రిగేడ్ తొలిదాడిz దీనిపైనే చేసింది. ఈ దాడి నుంచి షఫీక్ తప్పించుకున్నా.. మొత్తం 14 మంది చనిపోగా.. 35 మంది గాయపడ్డారు. బీఎల్ఏ కోసం ఈ బ్రిగేడ్ ఇప్పటి వరకు 12 భారీ ఆత్మాహుతి దాడులు చేసింది.
2018 ఆగస్టులో బలోచిస్థాన్‌లోని దల్బందిన్ వద్ద చైనా ఇంజినీర్లను లక్ష్యాంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. 2018 నవంబర్‌లో కరాచీలోని చైనా దౌత్యకార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. గంటలతరబడి జరిగిన ఈ దాడితో కరాచీ దద్దరిల్లిపోయింది. ముగ్గురు మిలిటెంట్లతో కలిపి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.గ్వాదర్‌లో పెరల్ కాంటినెంటల్ హోటల్‌పై 2019లో దాడి చేసింది. కొన్ని గంటలపాటు జరిగిన ఈ దాడితో చైనా ఇన్వెస్టర్లలో భయం రేకెత్తించింది. 2020 జూన్‌లో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజిని లక్ష్యంగా చేసుకుని మాజిద్ బ్రిగేడ్ విరుచుకుపడింది. దీనిని చైనాకు చెందిన ఓ కన్సార్టియం నిర్వహించడమే దాడికి కారణంగా తెలుస్తోంది. 2024 అక్టోబర్‌లో కరాచీ(karachi) ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దాడి చేసింది. దీనిలో ఇద్దరు చైనా ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు.
మాజిద్‌కు అండగా ఫతే (Fathe)స్క్వాడ్..
తాజాగా రైలు హైజాక్‌లో మాజిద్ బ్రిగేడ్‌కు అండగా.. ఫతే స్క్వాడ్ పాల్గొంది. ఇది బలోచిస్థాన్‌లోని కఠినమైన పర్వత ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహిస్తుంది. గెరిల్లా యుద్ధతంత్రంలో ఈ దళం ఆరితేరింది. ముఖ్యంగా పాక్ సైనిక కాన్వాయ్‌లను చుట్టుముటి దాడి చేయడం దీని శైలి. 2024లో ఫతే స్క్వాడ్ బీఎల్ఏలోని ఇతర గ్రూప్‌లతో కలిసి బలోచిస్థాన్ ప్రధాన మార్గాల్లో 14 బ్లాకేడ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 62 మంది పాక్ సైనికులను హత్య చేసింది.






